అల్లూ 'మ‌హాభార‌తం'కి పోటీగా 5డిలో మ‌రొక‌టి..!

Update: 2022-09-14 04:34 GMT
మ‌హాభార‌త క‌థ‌ను ఐదు సినిమాల సిరీస్ గా రూపొందించాల‌ని మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క‌ల‌లుగ‌న్నాడు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి ఏకంగా 1000 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాల‌ను నిర్మించాల‌ని భావించాడు. కానీ అతడు ఆ ప‌ని చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ప్రారంభించ‌కుండానే వెనుదిరిగాడు. దాదాపు 10 ఏళ్లు పైగా ఈ సిరీస్ కోస‌మే కేటాయించాల్సి ఉంటుంద‌ని అది అంత సులువు కాద‌ని కూడా అమీర్ ఖాన్ తెలిపాడు. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి మైండ్ లో మ‌హాభార‌తం ఆలోచ‌న ఉన్నా కానీ అది రూపుదాల్చ‌లేదు.

కానీ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ త‌న స్నేహితుడు మ‌ధు మంతెన‌తో క‌లిసి మ‌హాభార‌తం సిరీస్ నే ప్ర‌క‌టించేశారు. డిస్నీ+హాట్ స్టార్ తో క‌లిసి మూడు భాగాల వెబ్ సిరీస్ గా నిర్మించేందుకు భారీ బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నామ‌ని అధికారికంగా వివ‌రాలు వెల్ల‌డించి రెండు రోజులే అయ్యింది. కాస్టింగ్ స‌హా ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది. ఇంత‌లోనే మ‌హాభార‌తం పై మ‌రో నిర్మాత ప్ర‌య‌త్నం గురించిన ర‌హ‌స్యం లీకైంది.

తాజా స‌మాచారం మేర‌కు.. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత‌ ఫిరోజ్ నడియాడ్ వాలా మహాభారతంపై రూ. 5డి చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిసింది. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందించే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్- అజయ్ దేవగన్- రణవీర్ సింగ్ ల‌ను ప్రధాన పాత్రల కోసం పరిశీలిస్తున్నారని గుస‌గుస వినిపిస్తోంది.

ఇప్పటి వరకు భారతదేశంలో మహాభారత ఇతిహాసంపై ఒకే ఒక్క సినిమా తెర‌కెక్కింది. మహాభారత్ పేరుతో తెర‌కెక్కిన క్లాసిక్ లో  ప్రదీప్ కుమార్ - పద్మిని- దారా సింగ్ త‌దిత‌రులు నటించారు. A G నదియాడ్ వాలా నిర్మించారు. హేరా ఫేరీ - వెల్ కమ్ వంటి క్లాసిక్ కామెడీలను నిర్మించిన అతని కుమారుడు ఫిరోజ్ నడియాడ్ వాలా ఈ క్లాసిక్ ని మునుపెన్నడూ తెర‌పై చూడని రీతిలో మళ్లీ తెర‌కెక్కించాల‌ని భావిస్తున్నారు. యువ‌నిర్మాత ప‌క్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారని స‌మాచారం.

ఫిరోజ్ నడియాడ్ వాలా 'మహాభారత్' పై పనిని ప్రారంభించాడు. భారతీయ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా మ‌హ‌దాద్భుత దృశ్యకావ్యంగా ఈ చిత్రంగా రూపొందించాలని అత‌డు లక్ష్యంగా పెట్టుకున్నాడు. స్క్రిప్ట్ కు సంబంధించిన పని 4-5 సంవత్సరాలుగా జరుగుతోంది. నిర్మాతలు ప్రీ-ప్రొడక్షన్ పై రెండేళ్లకు మించి వెచ్చిస్తారు. ప్రధాన ఫోటోగ్రఫీ 2025 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతుంది. ఇది హిందీ భాషలో డిసెంబర్ 2025లో విడుదల చేస్తార‌ని అనేక భాషల్లోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తార‌ని స‌మాచారం. మహాభారతం మొత్తం కథను మూడు గంటల్లో తెర‌పై ఆవిష్క‌రిస్తారు.

మార్వెల్ - DC సినిమాలు .. లార్డ్ ఆఫ్ ది రింగ్స్.. గేమ్ ఆఫ్ థ్రోన్స్.. స్టార్ వార్స్.. హ్యారీ పోటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల‌కు ఇది భారతదేశం నుంచి సిస‌లైన‌ సమాధానంగా నిలుస్తుంద‌ని ఫిరోజ్ నడియాడ్ వాలా నమ్మకంగా ఉన్నారు. బడ్జెట్ సుమారు రూ.800 కోట్లు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేందుకు ఛాన్సుంద‌ని అంచనా. కాబట్టి ఇది ఆల్ టైమ్ అతిపెద్ద భారతీయ చిత్రం అవుతుందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నటీనటుల వివ‌రాల‌పై ఆరాలు తీయ‌గా.. అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ - రణవీర్ సింగ్ - పరేష్ రావల్- నానా పటేకర్ - అనిల్ కపూర్ త‌దిత‌ర‌ నటీనటులను పరిశీలిస్తున్నారు. ఎవరు ఏ పాత్రను పోషిస్తారనేది వేచి చూడాలి. కొత్త హీరోయిన్లతో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన అగ్ర నటీనటులను కూడా ముఖ్యమైన పాత్ర‌ల‌ కోసం ఎంపిక చేయాలని మేకర్స్ చూస్తున్నారు. దర్శకుడి కోసం వేట సాగుతోంది అని తెలిసింది.

1965లో విడుద‌లైన 'మహాభారతం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఫిరోజ్ అతని బృందం నాటి ఆ క్లాసిక్ సినిమాలో ఉన్న కథ ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. గ్లాడియేటర్- కింగ్ డమ్ ఆఫ్ హెవెన్ లాంటి హాలీవుడ్ చిత్రాల‌ తరహాలో చాలా వరకు యాక్షన్ రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. VFX-హెవీగా ఉండ‌దు. వీఎఫ్‌.ఎక్స్ కంటే పాత్రలు- కథలో భావోద్వేగాలు- డైలాగ్ లు మొదలైనవాటిని హైలైట్ గా ఆవిష్క‌రించాల‌ని ఫిరోజ్ భావిస్తున్నాడని తెలిసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ USAలోని లాస్ ఏంజిల్స్ లో రికార్డ్ చేస్తారు. ఇది హన్స్ జిమ్మెర్ ఇచ్చిన BGM లాగా గ్రాండ్ గా సినిమాటిక్ గా ఉంటుంది. లాస్ ఏంజెల్స్ కు చెందిన టాప్-క్లాస్ కంపెనీ VFX కోసం పని చేస్తుంది.

బాహుబ‌లి త‌ర‌హాలోనే 'మహాభారతం 5డి' కూడా గేమ్ ఛేంజర్ అవుతుంద‌ని భావిస్తున్నారు. 1995లో 'రామ్ శాస్త్ర'తో బాలీవుడ్ లో డాల్బీ సౌండ్ ని అందించిన‌ మొదటి త‌రం నిర్మాత‌లు నదియాడ్ వాలాలు. 1999లో కార్టూస్ లో ఒక పాట కోసం బ్లూ మ్యాట్ (ఒక రకమైన గ్రీన్ స్క్రీన్)ని ఉపయోగించిన మొదటి జ‌న‌రేష‌న్ నిర్మాత‌లు వారు. డై హార్డ్ దర్శకుడు జాన్ మెక్ టైర్నాన్ దానిని ఎంతగానో మెచ్చుకున్నాడు. అతను దానిని తన చిత్రం రోలర్ బాల్ (2002)లో ఉపయోగించాలనుకున్నాడు. న‌డియాడ్ వాలాలు.. ఆవారా పాగల్ దీవానా (2002)కోసం దేశంలో మొదటిసారిగా కేబుల్ వైర్ ను ఉపయోగించారు. దీనికి 'ది మ్యాట్రిక్స్'..'చార్లీస్ ఏంజిల్స్' నుండి యాక్షన్ కొరియోగ్రాఫర్ లు కూడా ప‌ని చేసారు. ఇది సినీహిస్ట‌రీలో  మొదటి 5డి భారతీయ చిత్రం అవుతుందన‌డంలో సందేహం లేదు! ఈ గొప్ప పురాణేతిహాస క‌థ‌ను తెర‌పై వీక్షించేందుకు ప్రేక్షకులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్లకు తరలివస్తారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మహాభారతం మానవజాతి చరిత్రలో ఇప్పటివరకు ప్ర‌జ‌ల‌కు తెలిసిన‌ అతి పెద్ద కథ. ఇది భావోద్వేగాలు- శృంగారం- ద్రోహం- మోసం- చేతబడి- మాయాజాలం వంటి అనేక అంశాల‌తో కొన‌సాగుతూనే అన్నింటికంటే ముఖ్యంగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక బోధనలను వర్ణించే సినిమాగా నిలుస్తుంది.  'రైట్‌ ఓవర్‌ మైట్‌' అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్‌. ఇది భారీ యుద్ధ సన్నివేశాలతో ర‌క్తి క‌ట్టిస్తుంది. సంగీతానికి గొప్ప  స్కోప్ ఉంది. ఇది గేమింగ్ -మర్చండైజింగ్ పరిశ్రమపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. వాట‌న్నిటినీ మించి ప్రపంచం వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్న నేటి కాలంలో ఇది శాంతిని కోరే సినిమా అవుతుంది. అహింసా మార్గంలో సంభాషణల ద్వారా ప్రతిదాన్ని పరిష్కరించడానికి ఎల్లప్పుడూ ఒక మంచి మార్గం ఉందని పునరుద్ఘాటిస్తుంది. ఆధ్యాత్మికత- దయ అనే అంశాల‌పై భారతదేశ విశ్వాసాన్ని ఈ సినిమా ప్ర‌పంచానికి ఆవిష్క‌రిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News