మళ్లీ తమిళ రిలీజెందుకు మహేష్?

Update: 2018-05-15 14:30 GMT
మహేష్ బాబు కెరీర్లో తొలి ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. తమిళంలో మార్కెట్ పెంచుకోవాలని ఎప్పట్నుంచో చూస్తున్న మహేష్.. ఈ క్రమంలోనే మురుగదాస్ లాంటి స్టార్ దర్శకుడితో ఆ చిత్రం చేశాడు. కానీ ఆశించిన ఫలితం దక్కలేదు. కానీ మహేష్ తమిళ జనాలకు ఆ చిత్రంతో బాగానే చేరవయ్యాడు. అతడి అందం.. అభినయం అక్కడి జనాల్ని ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ తమిళనాట బాగా ఆడింది.

నాలుగు కోట్లకు పైగా గ్రాస్ సాధించి.. తమిళనాట హైయెస్ట్ గ్రాస్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది. తమిళనాట సమ్మె కారణంగా స్లంప్ నెలకొన్న సమయంలో మహేష్ సినిమా విడుదల కావడం కలిసొచ్చింది. అక్కడి తెలుగు ప్రేక్షకులే కాక.. తమిళ జనాలు కూడా మహేష్ కోసం ఈ సినిమా చూశారు. తమిళనాట ఓ తెలుగు సినిమా రూ.4 కోట్లకు పైగా.. అందులోనూ చెన్నైలో మాత్రమే 1.65 కోట్లు వసూలు  చేయడమంటే మాటలు కాదు. మాగ్జిమం అక్కడ ఎంత వసూలు చేయొచ్చో అంతా చేసిందీ చిత్రం.

అలాంటపుడు మళ్లీ ‘భరత్ అనే నేను’ను తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేయాల్సిన అవసరముందా అన్నది సందేహం. కానీ ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాత్రం ఆ పనే చేస్తున్నాడు. ‘భరత్ యనుమ్ నాన్’ అనే పేరుతో ఈ చిత్రాన్ని మే 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ శుక్రవారం ట్రైలర్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఐతే 25న ఇంకో రెండు తమిళ సినిమాలు కూడా రిలీజవుతున్న నేపథ్యంలో ‘భరత్ అనే నేను’ తమిళ వెర్షన్ ఏమాత్రం ప్రభావం చూపుతుందో చూడాలి.
Tags:    

Similar News