మహేష్ కూడా మల్టీప్లెక్స్ ఓనరా??

Update: 2015-10-21 10:34 GMT
మహేష్ బాబు ఇప్పటికే నిర్మాతగా మారిన విషయం తెలిసింది. శ్రీమంతుడు మూవీతో సక్సెస్ కూడా సాధించేశాడు సూపర్ స్టార్. ఇప్పుడు టాలీవుడ్ ప్రిన్స్ మరో సినిమా సంబంధిత వ్యాపారంలో కూడా అడుగు పెడుతున్నాడు. అదే మూవీ ఎగ్జిబిషన్ వ్యాపారం. ప్రస్తుతం థియేటర్స్ నిర్వహణ అంత లాభదాయకంగా లేదన్న మాట వాస్తవమే. అయితే.. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు నటీనటులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. ప్రధానం మల్టీప్లెక్సుల నిర్వహణ ఊరిస్తోంది.

భవిష్యత్తులో మంచి లాభసాటి వ్యాపారంగా మారనుందనే అంచనాలున్నాయి. అందుకే మహేష్ కూడా ఓ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్వహించబోతున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ గచ్చీబౌలి ప్రాంతంలో ఉన్న ప్రిస్టన్ ప్రైమ్ మాల్ లో మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలు తలకెత్తుకుంటున్నాడు మహేష్. నాలుగు స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్.. త్వరలో ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఈ వెంచర్ కోసం 12కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక హైద్రాబాద్ లోనే కాకుండా.. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఫిలిం ఎగ్జిబిషన్ రంగంలోకి ప్రవేశించేందుకు మహేష్ సన్నద్ధమవుతున్నాడు.

మరోవైపు ఇప్పటికే విజయవాడలో వెంకీ రాణా కలిసి.. కేపిటల్ సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేశారు. రీసెంట్ గా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. వీళ్లిద్దరే కాకుండా.. మెగా ఫ్యామిలీ కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్లు మాల్స్, మల్టీప్లెక్సుల నిర్వహణ మంచి లాభసాటి వ్యాపారం కానుందనే అంచనాలే.. స్టార్ హీరోలను ఈ వ్యాపారంలోకి ప్రవేశించేలా చేస్తున్నాయి.
Tags:    

Similar News