డిజాస్టర్ తిన్నా మహేష్ తగ్గలేదస్సలు

Update: 2016-06-09 17:30 GMT
హీరో హీరోయిన్లయినా.. దర్శకులైనా.. హిట్టు కొడితే రెమ్యూనరేషన్ పెంచడం.. ఫ్లాప్ ఎదురైతే రెమ్యూనరేషన్లో కొంచెం కోత పడటం మామూలే. ఐతే మహేష్ బాబు మాత్రం ఫ్లాప్ లకు అతీతం అన్నట్లుంది పరిస్థితి. 1 నేనొక్కడినే.. ఆగడు లాంటి డిజాస్టర్లు ఎదురైనా.. ‘శ్రీమంతుడు’కు ముందు సినిమాల కంటే ఎక్కువే రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ప్రొడక్షన్లో కూడా హ్యాండ్ పడటం వల్ల మహేష్ కు రూ.20 కోట్ల దాకా ముట్టినట్లు సమాచారం. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు దాని కంటే ఎక్కువే అందుకున్నాడు. ఐతే ఈ సినిమా డిజాస్టర్లకే డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ మహేష్ తర్వాతి సినిమా మీద కచ్చితంగా పడుతుందనే అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది.

మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే తర్వాతి సినిమాకు రికార్డు స్థాయిలో ఏకంగా రూ.28 కోట్ల పారితోషకం తీసుకున్నాడట మహేష్ బాబు. ఇది టాలీవుడ్లో రికార్డు. రెమ్యూనరేషన్ విషయంలో మహేష్ తో పోటీ పడే పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఎంత తీసుకున్నాడన్నది క్లారిటీ లేకపోయింది. ఎందుకంటే ఈ సినిమాకు పవన్ ఆప్త మిత్రుడు శరత్ మరార్ నిర్మాత. అది ఒకరకంగా పవన్ హోం ప్రొడక్షన్ అని చెప్పాలి. పవన్ ఎంత తీసుకున్నాడో కానీ.. సినిమా డిజాస్టర్ కావడంతో పుచ్చుకున్నదాంట్లో చాలా వరకు వెనక్కివ్వాల్సి వచ్చింది. పవన్ బయటి నిర్మాతలెవరికైనా సినిమా చేసినపుడు అతడి పారితోషకం మీద ఓ క్లారిటీకి రావచ్చు.

ఇక మహేష్ విషయానికొస్తే లెక్కలు క్లియర్ గా ఉన్నాయి. పారితోషకం విషయంలో అతనే టాలీవుడ్ నెంబర్ వన్ అని చెప్పాలి. మురుగ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కబోతున్న నేపథ్యంలో శ్రమ ఎక్కువ.. అలాగే మార్కెట్ కూడా పెరుగుతుంది కాబట్టి మహేష్ పారితోషకం పెంచాల్సి వచ్చింది. ఈ సినిమాలో మహేష్ తో జోడీ కట్టబోతున్న పరిణీతి చోప్రాకు మూడున్నర కోట్లిస్తున్నట్లు సమాచారం. రూ.90 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కున్న ఈ చిత్రం ఈ నెలాఖర్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
Tags:    

Similar News