ఈ డేట్ల గోల ఎందుకులే మహేష్..

Update: 2017-05-22 11:25 GMT
సినిమా ప్రారంభోత్సవం రోజే రిలీజ్ డేట్ ఇవ్వడం గొప్ప కాదు.. చెప్పినట్లు ఆ తేదీకే సినిమాను రిలీజ్ చేయడం గొప్ప. ఈ విషయంలో మహేష్ బాబు చాలా వరకు మాట తప్పుతుంటాడు. గత కొన్నేళ్లలో మహేష్ సినిమాలు ఏవి కూడా చెప్పిన డేటుకి రిలీజ్ చేసింది లేదు. మహేష్ చివరి సినిమా ‘బ్రహ్మోత్సవం’ విషయానికి వస్తే.. దాన్ని గత ఏడాది ఏప్రిల్ నెలాఖర్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది మే 20కి విడుదలైంది. అంతకుముందు ‘శ్రీమంతుడు’ను జూన్లోనే విడుదల చేయాలనుకున్నారు. కానీ జులైకి వాయిదా పడింది. ‘బాహుబలి’ కోసం మళ్లీ వాయిదా వేయక తప్పలేదు.

ఇక మహేష్ లేటెస్ట్ మూవీ ‘స్పైడర్’ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏప్రిల్లో అనుకున్న సినిమా కాస్తా.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వెళ్తోంది. చివరగా ఆగస్టు రిలీజ్ అన్నారు కానీ.. అది కూడా ఇప్పుడు ఖాయం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల దర్శకత్వంలో మహేష్ చేయబోయే కొత్త సినిమాను మొదలుపెట్టే సమయంలోనే జనవరి 11న రిలీజ్ చేస్తామని ప్రకటించేసరికి అభిమానులకు రుచించట్లేదు. ముందు సినిమా మొదలుపెట్టి.. చకచకా పూర్తి చేసి ఆ తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తే బాగుంటుందని.. అలా కాకుండా ముందే డేట్ ఇస్తే కలిసి రావట్లేదని.. డెడ్ లైన్ అందుకోవడం కష్టమవుతోందని.. అందుకే విడుదల తేదీ గురించి మాట్లాడకుండా ముందు పని కానివ్వలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News