మహేష్ ను వాడేస్తున్న దిల్ రాజు

Update: 2019-10-01 08:52 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలే కాకుండా ఇతర సినిమాలపై కూడా స్పందిస్తూ ఉంటారు.  ఏదైనా మంచి సినిమా కనుక చూస్తే మహేష్ ఆ సినిమా టీమ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తారు. రీసెంట్ గా 'వాల్మీకి' సినిమా చూసిన తర్వాత హీరో వరుణ్ తేజ్ ను.. దర్శకుడు హరీష్. ఇతర టీమ్ మెంబర్స్ ను అభినందించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి 'సైరా' ట్రైలర్ చూసిన తర్వాత టీమ్ అందరికీ అల్ ది బెస్ట్ చెప్పారు. అయితే  మహేష్ ప్రతి సినిమాపైన కామెంట్ పెట్టరు.  కానీ రీసెంట్ గా రవిబాబు 'ఆవిరి' సినిమా టీజర్ ను షేర్ చేయడం.. దానిపై స్పందించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

కారణం ఏంటంటే సహజంగా ఇలాంటి చిన్న సినిమాలకు  ప్రేక్షకాదరణ దక్కి హిట్ అయితే మహేష్ ప్రశంసిస్తాడు కానీ ఇలా ముందే సినిమాపై స్పందించడం ఏంటని చర్చ మొదలైంది.  పైగా రవిబాబు తీసే సినిమాలకు ఏమాత్రం ప్రేక్షకాదరణ దక్కడం లేదు. అలాంటిది రవిబాబును 'మాస్టర్ అఫ్ హారర్ జోనర్' అని ప్రశంసించడం చూస్తే దీని వెనక ఏదో కారణం ఉన్నట్టు అర్థం అవుతుంది.  'ఆవిరి' సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.  మహేష్ లాస్ట్ సినిమా 'మహర్షి' కి.. ఇప్పుడు మహేష్ పని చేస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి రాజుగారు నిర్మాణ భాగస్వామి.  దీంతో దిల్ రాజు ఒత్తిడితోనే 'ఆవిరి' పై స్పందించి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది.

రవిబాబు ఈమధ్య దర్శకత్వం వహించిన సినిమాల లిస్టు తీస్తే 'అవును' తప్ప మరో హిట్ లేదు.  మిగతా సినిమాలన్నీ ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ కావడం లేదు. నిజానికి రవిబాబు సినిమాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.  చివరికి 'ఆవిరి' టీజర్ కు కూడా ఫుల్ నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఒక టీజరే ప్రేక్షకులకు టెస్ట్ అనుకుంటే వరసగా అదే టీజర్ ను స్వల్ప మార్పులతో తిప్పి తిప్పి ఇప్పటికి మూడు టీజర్లు రిలీజ్ చేశారు.  టీజర్ కింద కామెంట్ సెక్షన్ చూస్తే ఈ టీజర్లు చూసి ఆడియన్స్ ఎలా నవ్వుకుంటున్నారో అర్థం అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే మహేష్ చేత 'ఆవిరి' పోస్ట్ పెట్టించడం.. రవిబాబును  మహేష్ చేత 'హారర్ మాస్టర్' అని పొగిడేలా ఒత్తిడి చేయడం.. మహేష్ ను దిల్ రాజు వాడుకోవడమేని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

నిజానికి ఒక చిన్న సినిమా టీజర్.. ట్రైలర్ బాగున్నప్పుడు మహేష్ స్పందిస్తే బాగుంటుంది.  ఆ సినిమాకు పబ్లిసిటీ అవుతుంది.. కానీ అసలు సినిమా స్థాయిలోనే లేని టీజర్లను షేర్ చేయడం.. ఆ దర్శకులను పొగడడం చేస్తే మహేష్ క్రెడిబిలిటీ దెబ్బతినే అవకాశం ఉందని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.  గతంలో రాజమౌళి  కూడా ఇలా కొన్ని సినిమాల విషయంలో మొహమాటానికి పోయి నెటిజన్ల ట్రోలింగ్ కు గురయ్యారని గుర్తు చేస్తున్నారు.


Tags:    

Similar News