ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుందన్న మహేశ్ బాబు!

Update: 2021-12-06 04:45 GMT
ఎన్టీఆర్ కి గేమ్ షోలు చేయడం .. స్టేజ్ లపై సందడి చేయడం .. నాన్ స్టాప్ గా మాట్లాడటం అలవాటు. మహేశ్ బాబు వాటన్నినీకీ చాలా దూరం. అలాంటి ఇద్దరూ ఒక వేదికపై ఎప్పుడూ కనిపించలేదు.

వాళ్లు సరదాగా కబుర్లు చెప్పుకోవడం ఎవరూ చూడలేదు. అలాంటి అభిమానుల ముచ్చటను 'ఎవరు మీలో కోటీశ్వరుడు' కార్యక్రమంతో జెమినీ టీవీ వారు తీర్చేశారు. ఈ కార్యాక్రమంలో మహేశ్ పాల్గొంటాడనే ప్రోమో వేసిన దగ్గర నుంచి అంతా కూడా ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందా అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తూ వచ్చారు.

అలా ఎన్టీఆర్ - మహేశ్ బాబు కాంబినేషన్లోని ఎపిసోడ్ నిన్న రాత్రి ప్రసారమైంది. ఒక వైపున హోస్టుగా ఎన్టీఆర్ .. మరో వైపున చీఫ్ గెస్టుగా మహేశ్ బాబు.

ఒకే వేదికపై ఇద్దరూ కలిసి ఈ ఎపిసోడ్ ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా .. మరెంతో సరదాగా ముందుకు నడిపించారు. సెట్లోకి అడుగుపెడుతూనే మహేశ్ బాబు .. సెట్ చాలా బాగుందంటూ చెప్పాడు. ఇలాంటి గేమ్ షోలకి తాను ఎప్పుడూ వెళ్లలేదనీ .. ఇదే ఫస్టు టైమ్ అనీ .. అది కూడా ఎన్టీఆర్ ఉన్నాడు గనుక వచ్చానని అన్నాడు. ఈ గేమ్ షో ద్వారా తాను గెలుచుకునే మొత్తం ఒక ఛారిటీకి వెళుతుందనే విషయాన్ని స్పష్టం చేశాడు.

ఆ తరువాత ఎన్టీఆర్ .. మహేశ్ బాబు మధ్య ప్రశ్నలు .. సమాధానాలు నడుస్తూనే, వాటికి సంబంధించిన విషయాల పట్ల ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. కురుక్షేత్రానికి సంబంధించిన ప్రశ్న ఎదురైనప్పుడు, ఆ టైటిల్ లో కృష్ణగారు సినిమా చేశారనీ .. అలాంటి పౌరాణిక పాత్రలు తాను చేయక పోవచ్చని మహేశ్ అన్నాడు.

కృష్ణుడి పాత్రకి మహేశ్ సెట్ అవుతాడని ఎన్టీఆర్ చెప్పాడు. మొదటిసారిగా తాను 'చెక్' అందుకున్నది .. ఆటోగ్రాఫ్ ఇచ్చింది 'రాజకుమారుడు' సినిమా కోసమని మహేశ్ బాబు చెప్పాడు.

ఆర్మీ నేపథ్యంలో సాగే 'మేజర్' వంటి సినిమాను నిర్మిస్తున్నందుకు తనకి చాలా గర్వంగా ఉందని మహేశ్ బాబు అన్నాడు. స్పోర్ట్స్ అంటే తనకి చాలా ఇష్టమనీ .. కాలేజ్ రోజుల్లో క్రికెట్ ఆడేవాడినని చెప్పాడు. గౌతమ్ తో కలిసి స్పోర్ట్స్ చూస్తుంటానని అన్నాడు.

ఎన్ని దేశాలు తిరిగినా తన ఫేవరేట్ ప్లేస్ 'ఊటీ' అని చెప్పుకొచ్చాడు. తన గ్రాండ్ మదర్ చేతి వంట .. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టమనీ, సితారకి తండ్రిగా తాను పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిదని అన్నాడు.

ఆడపిల్ల తండ్రిగా ఆయనను చూస్తే తనకి జలస్ గా ఉందని ఎన్టీఆర్ జోక్ చేశాడు. గేమ్ షోలకి హోస్ట్ గా చేసే అవకాశం వచ్చినా చేయనని, అందుకు సంబంధించిన స్కిల్స్ తనలో చాలా తక్కువని మహేశ్ బాబు చెప్పాడు.

ఈ జనరేషన్ హీరోలంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారనీ .. మల్టీస్టారర్ సినిమాలు చేయడం తనకి ఇష్టమేనని మహేశ్ బాబు చెప్పాడు. ఎన్టీఆర్ తోను ఒక సినిమా చేయాలనుందని అన్నాడు. ఎన్టీఆర్ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడం కోసం మహేశ్ బాబు .. కొరటాలకి వీడియో కాల్ చేశాడు. చివరికి ఈ గేమ్ షో ద్వారా మహేశ్ 25 లక్షలు గెలుచుకున్నాడు.

ఇంతకుముందు ఈ షోలో చరణ్ .. రాజమౌళి .. కొరటాల .. సమంత వంటి సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఈ షోను చరణ్ తో మొదలుపెట్టి మహేశ్ బాబుతో ముగించడం విశేషం. ఎన్టీఆర్ .. మహేశ్ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ .. సరదాగా నడిపించిన ఈ ఎపిసోడ్, ఈ సీజన్ లోనే బెస్ట్ ఎపిసోడ్ గా నిలిచిపోతుందని చెప్పాలి.




Tags:    

Similar News