మ‌హేష్‌ కి అక్క‌డ క‌లిసొచ్చేనా?!

Update: 2015-07-23 19:49 GMT
ఒకేసారి మూడు నాలుగు భాష‌ల్లో సినిమా విడుద‌లైతే ఎన్ని ప్ర‌యోజ‌నాలుంటాయో `బాహుబ‌లి` చాటిచెప్పింది. తెలుగు, త‌మిళం, మల‌యాళం, హిందీ... ఇలా ప్ర‌తీ చోట `బాహుబ‌లి`కి భారీ వ‌సూళ్లు ద‌క్కాయి. డ‌బ్బింగ్ సినిమాల విష‌యంలో కొత్త చ‌రిత్ర‌ను సృష్టించింది. ప్ర‌తీచోటా రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌ట్టుకొంది. అందుకే ఇప్పుడు ఇత‌ర క‌థానాయ‌కులంతా రెండు మూడు భాష‌ల్లో సినిమాలు చేయాల‌ని ఫిక్స‌యిపోయారు. త‌మిళ్ క‌థానాయ‌కులైతే మ‌ల్టీ లాంగ్వేజ్ మార్కెట్ని ఎప్పుడో రుచి చూశారు. అందుకే వాళ్లు చేసే ప్రతి సినిమానీ ప‌క్క‌భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తుంటారు. మ‌న క‌థానాయ‌కుల‌కు త‌మిళ్ మాట్లాడ‌టం వ‌చ్చినా స‌రే... ఇన్నాళ్లూ ఆ మార్కెట్‌ పై దృష్టిపెట్ట‌లేదు. `బాహుబ‌లి` త‌మిళంలో బంప‌ర్ హిట్ సాధించాక‌...  తొలిసారి ఇప్పుడు  మ‌హేష్ తెలుగుతో పాటు త‌మిళంలోనూ త‌న సినిమాని విడుద‌ల చేస్తున్నాడు. `శ్రీమంతుడు` సినిమాకి మ‌హేష్ కూడా ఓ నిర్మాత కావ‌డంతో టైమ్ తీసుకొని మ‌రీ రెండు భాష‌ల్లో సినిమాని విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశాడు.

మ‌హేష్‌ కి తెలుగుతో పాటు త‌మిళం కూడా బాగా వ‌చ్చు. చెన్నై లో పుట్టి పెరిగిన‌వాడు కావ‌డంతో త‌మిళం నేర్చుకొన్నాడు. అయినా స‌రే... ఎప్పుడూ త‌మిళంలో సినిమాలు చేయ‌లేదు. సినిమా విడుద‌ల‌య్యాక ఆరేడు నెల‌ల‌కో, యేడాదికో ఔత్సాహిక నిర్మాత‌లు అక్క‌డ మ‌హేష్ సినిమాల్ని డ‌బ్ చేసేవాళ్లు. దేశ‌వ్యాప్తంగా క్రేజ్ ఉన్న‌ప్ప‌టికీ తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వ‌చ్చాడు మ‌హేష్‌. ఇక నుంచి త‌న మార్కెట్ని విస్తృతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా సినిమాలు చేయాల‌ని ఫిక్స‌యిపోయాడు. ప్ర‌స్తుతానికి శ్రీమంతుడుతో త‌మిళంలోకి వెళ‌తాడు. త‌దుప‌రి రాజ‌మౌళితో చేయ‌నున్న సినిమాతో  హిందీలోనూ భారీగా ఎంట్రీ ఇవ్బ‌బోతున్నాడు. మ‌రి `శ్రీమంతుడు`కి త‌మిళ్ మార్కెట్‌ లో ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుందో చూడాలి.
Tags:    

Similar News