రికార్డు విక్టరీ : విష్ణును 'మా' అంటూ 120+ మెజార్టీ ఇచ్చారు

Update: 2021-10-10 17:25 GMT
మా ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాష్ రాజ్‌ మరియు మంచు విష్ణులు పోటీ పడబోతున్నట్లుగా ప్రకటించారు. ఎన్నికల ప్రకటన రాకుండానే గెలుపు కోసం తమ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టారు. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్ ల ప్యాన్సల్‌ మద్య మరియు వారి వ్యక్తిగతంగా కూడా విమర్శలు వచ్చాయి. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడంతో ఇవి మా ఎన్నికలేనా లేదా రాజకీయ ఎన్నికలా అన్న అనుమానం కలిగేలా చేశారు. 900 మంది మెంబర్స్ ఉన్న మా కు ఎన్నికలు ఈ రేంజ్ లో జరగడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ పెద్దలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఒకరి వైపే తప్పు ఉందని అనుకోవడం లేదు. ఇద్దరు కూడా మాటకు మాట అనుకోవడం వల్లే గొడవ అంతగా పెరిగింది. అంతగా హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్‌ నమోదు అయ్యింది.

ముంబయి.. బెంగళూరు మరియు చెన్నై నుండి కూడా మా సభ్యులు కొందరు వచ్చి ఎన్నికల్లో పాల్గొన్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలన్ ను వినియోగించుకున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎక్కువ శాతం మంచు విష్ణు కు మద్దతుగా వచ్చారని అనుకున్నారు. నరేష్‌ మాట్లాడుతూ అదే మాట అన్నాడు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన 30 నుండి 40 ఓట్లు ఖచ్చితంగా విష్ణు కు కలిసి వస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన అభిప్రాయం నిజం అయినట్లుగా అనిపించింది. ఆ ఓట్లు మాత్రమే కాకుండా ఇతర ఓట్లు కూడా భారీగా మంచు విష్ణుకు పడ్డాయి. 30.. 40 కాదు ఏకంగా 127 ఓట్ల మెజార్టీ ని మంచు విష్ణు దక్కించుకున్నాడు. ఈ మెజార్టీని మంచు విష్ణు  దక్కించుకోవడం ఖచ్చితంగా రికార్డు విక్టరీ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఓడి పోయిన వారికి కేవలం 20 నుండి 30 ఓట్ల తేడా మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు 120 కు పైగా ఓట్లు మంచు విష్ణుకు మెజార్టీ.

మా లో మొత్తంగా 883 మంది సభ్యత్వంను కలిగి ఉన్నారు. వారిలో 626 మంది ప్రత్యక్ష్యంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు పోస్టల్ బ్యాలట్‌ ద్వారా కూడా తమ ఓటును వినియోగించుకున్నారు. మొత్తంగా 700 మందికి పైగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ స్థాయిలో పోలింగ్ అవ్వడం మామూలు విషయం కాదు. గతంలో పలు సార్లు ఇందులో సగం ఓట్లు కూడా పోల్‌ అయిన దాఖలాలు లేవు. అలాంటిది ఈసారి పోటీ పడ్డ అభ్యర్థులు ఎంతగా పోలింగ్‌ ను పెంచేందుకు ప్రయత్నించారు అనేది అర్థం చేసుకోవచ్చు. పోలింగ్‌ పెరుగుదల అనేది నూటికి నూరు శాతం మంచు విష్ణు కు కలిసి వచ్చింది. మొత్తం పోల్‌ అయిన ఓట్లలో 50 ఓట్లు చెల్లకుండా పోయాయి. మిగిలిన ఓట్లను లెక్కించిన సమయంలో 120 ఓట్లకు పైగా మెజార్టీని మంచు విష్ణు దక్కించుకున్నారు అంటూ సమాచారం అందుతోంది. మంచు విష్ణు కు మొత్తంగా 396 ఓట్లు పోల్‌ అవ్వగా.. ప్రకాష్ రాజ్ కు 269 ఓట్లు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా ఘన విజయాన్ని సొంతం చేసుకుని మా కొత్త ప్రెసిడెంట్‌ గా నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్‌ లోని పలువురు ఈసీ మెంబర్స్ గెలిచారు. మొత్తం 18 మంది ఈసీ సభ్యుల్లో ప్రకాష్‌ రాజ్ ప్యానల్‌ నుండి 11 మంది గెలువగా మంచు విష్ణు ప్యానల్ నుండి ఏడుగురు మాత్రమే ఈసీ సభ్యులుగా గెలుపొందారు.

మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌ గా ప్రకాష్ ప్యానల్‌ తరపున పోటీ చేసిన శ్రీకాంత్ గెలుపొందారు. మంచు విష్ణు ప్యానల్‌ లో ఈ పదవికి బాబు మోహన్‌ పోటీ పడ్డారు. 125 ఓట్ల తేడాతో శ్రీకాంత్‌ గెలిచినట్లుగా ఎన్నికల అధికారులు తెలియజేశారు.

కీలకంగా మారిన జనరల్ సెక్రటరీ పదవికి గాను ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ నుండి జీవిత పోటీ చేయగా.. మంచు విష్ణు ప్యానల్‌ నుండి రఘు బాబు పోటీ చేశారు. జీవిత పై 7 ఓట్ల తేడాతో రఘు బాబు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈయనకు బండ్ల గణేష్‌ గట్టి సపోర్ట్‌ ను ఇచ్చాడు.

మా లో కీలకమైన కోశాధికారి పోస్ట్‌ కు గాను విష్ణు ప్యానల్‌ నుండి శివ బాలాజీ పోటీ చేయగా.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ నుండి నాగినీడు పోటీ చేశారు. వీరిద్దరిలో నాగినీడు పై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ గెలుపొందాడు.  మా వైస్ ప్రెసిడెంట్‌ గా మంచు విష్ణు ప్యానల్‌ నుండి పోటీ చేసిన మాదల రవి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ పదవికి గాను ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ నుండి బెనర్జీ పోటీ చేశాడు. ఆయన ఓటమిని చవి చూశాడు. మంచు ప్యానల్‌ నుండి మొత్తం ఏడు మంది ఈసీ మెంబర్స్ గా గెలుపొందారు.

పూజిత.. శశాంక్‌.. జయవాణి.. శ్రీనివాసులు పి.. శ్రీలక్ష్మి.. మాణిక్‌.. హరినాథ్ బాబులు ఈసీ మెంబర్స్ గా గెలుపొందారు. ప్రకాష్‌ రాజ్‌ ప్యానల్‌ కు చెందిన అనసూయ.. శివారెడ్డి.. కౌశిక్‌.. అనసూయ.. సురేష్‌ కొండేటి లు ఈసీ మెంబర్స్ గా గెలుపొందారు.

ఈసీ మెంబర్స్ గా పోటీ చేసిన సంపూర్నేష్‌ బాబు మరియు బ్రహ్మాజీ, ఖయ్యుం, ప్రగతిలు గెలుపొందారు. విజయం పై మంచు విష్ణు వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు విజయం కన్ఫర్మ్‌ అయిన వెంటనే పెద్ద ఎత్తున బాంబులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. మొత్తంగా మా ఎన్నికల హడావుడి ఆసక్తికర ఫలితాలతో ముగిసాయి.

మంచు విష్ణు ప్రెస్‌ మీట్‌ పెట్టి విజయం పై స్పందించనున్నారు. ప్రకాష్‌ రాజ్‌ ఇంకా మీడియా ముందుకు ఈ విషయమై స్పందించేందుకు రాలేదు. మంచు వర్గం ఇచ్చిన ప్రథానమైన హామీ మా భవనం గురించి ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ విషయమై ప్రెస్ మీట్ లో ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.


Tags:    

Similar News