మంచు లక్ష్మి మిస్సయిన ‘పెళ్లిచూపులు’

Update: 2016-07-29 05:05 GMT
మంచు ఫ్యామిలీ నుంచి గత కొన్నేళ్లలో వచ్చిన సినిమాల్లో చాలా వరకు నిరాశ పరిచాయి. సక్సెస్ రేట్ బాగా తక్కువ. దేనికైనా రెడీ.. దూసుకెళ్తా.. కరెంటు తీగ మినహాయిస్తే గత పది పన్నెండేళ్లలో ‘మంచు’ కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమాలు చాలా వరకు ఫెయిల్యూర్సే. ఇక మంచు లక్ష్మి స్వయంగా నిర్మించిన సినిమాల్లో ఒక్కటీ ఆడలేదు. ‘ఝుమ్మంది నాదం’ దగ్గర్నుంచి ‘దొంగాట’ వరకు ఫెయిల్యూర్లే మూటగట్టుకుందామె. ఐతే లేక లేక ఆమెకు నిర్మాతగా ఓ హిట్టుకొట్టే అవకాశం వస్తే దాన్ని వదులేసుకుందట లక్ష్మి. ఆ సినిమా మరేదో కాదు.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘పెళ్లిచూపులు’. ఈ సినిమా హిట్టవడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ పాజిటివ్ బజ్ తో రిలీజవుతోందీ సినిమా. ఐతే ఈ కథ ముందు మంచు లక్ష్మికే చెప్పాడట తరుణ్ భాస్కర్. ఐతే కొన్ని కారణాల వల్ల ఆమె నిర్మాణంలో సినిమా చేయలేకపోయానన్నాడు తరుణ్.

‘‘నేనేంటో ముందు జనాలకు తెలిసింది షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే. అష్టాచెమ్మా నిర్మాత రామ్మోహన్ గారి ద్వారా ‘బీటెక్’ అనే డ్రామా స్క్రిప్టును షార్ట్ ఫిలింగా తీశాను. ఆ తర్వాత ‘సైన్మా’ అనే షార్ట్ ఫిలింతో నాకు మంచి పేరొచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి మంచు లక్ష్మిగారు పిలిచి నాకు ఫీచర్ ఫిల్మ్ చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు. ఆమెకు ‘పెళ్లిచూపులు’ కథ కూడా చెప్పాను. ఆమెకు బాగా నచ్చింది కూడా. కానీ లక్ష్మిగారు బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. తర్వాత సురేష్ బాబు గారికి కథ చెప్పడం.. ఆయన రాజ్ కందుకూరికి పరిచయం చేయడం.. ఈ సినిమా పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి’’ అని తరుణ్ చెప్పాడు.
Tags:    

Similar News