VM19 అప్డేట్: హీరోయిన్లను ఫుల్ గా వాడేస్తున్న మంచు విష్ణు..!

Update: 2022-06-09 09:30 GMT
గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. చివరగా 'మోసగాళ్ళు' సినిమాతో పరాజయం అందుకున్నాడు. ఇప్పుడు #VM19 చిత్రంతో హిట్ కొట్టడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు అనే పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. 'Rx 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మరియు హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హీరోయిన్లతో కలిసి ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు మంచు విష్ణు. షూటింగ్ సమయంలో పాయల్ - సన్నీ లతో ఫన్నీ గేమ్స్ ఆడుతూ.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు.

ఇప్పుడు వినూత్నంగా టైటిల్ అనౌన్స్ మెంట్ అప్డేట్ తో వచ్చారు #VM19. 'ఓయ్.. గాలి నాగేశ్వరరావు.. చాలా కాలంగా కనిపించలేదు' అని సన్నీ లియోన్ ట్వీట్ చేయగా.. దీన్ని రీట్వీట్ చేస్తూ 'ఇంకా ఎన్ని రోజులు ఇలా పిలిపించుకుంటావ్ ఫ్రెండ్ విష్ణూ?' అని పాయల్ పేర్కొంది.

విష్ణు దీనికి బదులిస్తూ.. ''ఈ ఒక్క రోజు వెయిట్ చెయ్ స్వాతి.. రేపు (జూన్ 10) ఉదయం 9.32 గంటలకు అందరికీ చెప్పేద్దాం'' అంటూ టైటిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

మంచు అవ్రమ్ భక్త సమర్పణలో ఏవీఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోన వెంక‌ట్ ఈ సినిమాకు క‌థ‌ - స్క్రీన్ ప్లే అందించ‌డ‌మే కాకుండా క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ సాంగ్‌ కు ప్ర‌భుదేవా కొరియోగ్ర‌ఫీ చేస్తున్నారు. మంచు విష్ణు కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News