మణిశర్మలో వైరాగ్యం.. ఎందుకొచ్చిందంటే..

Update: 2018-06-23 01:30 GMT

ఒకప్పుడు బాగా వెలుగు వెలిగి ఇప్పుడు తెరమరుగైన సంగీత దర్శకుల్లో మణిశర్మ ఒకరు. పదేళ్ల క్రితం వరకూ తెలుగులో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మనే.. మహేష్ బాబు తో ఎక్కువ సినిమాలకు ఆయన సంగీతం అందించారు. చిరంజీవి - పవన్ లాంటి స్టార్ లకు మ్యూజిక్ ఇచ్చాడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఇచ్చి మెలోడీ కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి మణిశర్మ హవా ఇప్పుడు తగ్గిపోయింది. కొత్తతరం రావడంతో అందరూ వర్ధమాన సంగీత దర్శకులనే ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పుడు మణిశర్మతో సినిమా తీసే నాథుడే లేకుండా పోయారు. ఇక మణిశర్మ సంగీతంలో కూడా మునపటి వాడి కనిపించకపోయేసరికి అగ్ర హీరోలు - దర్శకులు ఎవ్వరూ ఆయన దరిదాపుల్లోకి కూడా పోవడం లేదు.

ప్రస్తుతం తన చేతిలో సినిమాలు లేకపోవడంతో మణిశర్మ పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నాడు. ఖాళీగా ఉన్నానని.. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని మణిశర్మ చెప్పుకొచ్చాడు. అయితే తన దగ్గర  పని చేసి ఇప్పుడు వేరే వాళ్ల దగ్గర చేస్తున్న శిష్యుల వైఖరితో తాను బాధపడుతున్నట్లు మణి వాపోయాడు.

వేరే వాళ్ల వద్ద పనిచేస్తున్న తన శిష్యులు తాజాగా తనను తిట్టడం భరించలేకపోతున్నానని మణి తెలిపాడు. తాను మామూలుగా పని విషయంలో చాలా కఠినంగా ఉంటానని.. కాబట్టి పని చేసే విషయంలో పొరపాట్లు జరిగితే తిట్టేవాడినని తెలిపాడు. అపార్థం చేసుకొని తన శిష్యులు ఇప్పుడు వేరేవాళ్ల వద్ద తనను తిట్టడం మనస్తాపానికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లకు సంగీత విద్య నేర్పిస్తే ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపాడు. తమ రోజుల్లో గురువులు ఇంకా కఠినంగా ఉండేవారని.. వాళ్లతో పోలిస్తే తాను నయమేనని మణి చెబుతున్నాడు. ఈ మధ్య ఓ అమ్మాయి కూడా తాను తిట్టినందుకు కుంగిపోయానని అనడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. తాను ఎవ్వరినీ ఉద్దేశపూర్వకంగా తిట్టనని.. పనిలో పర్ ఫెక్షన్ కోసమే తిడతానని మణిశర్మ స్పష్టం చేశాడు. 
Tags:    

Similar News