రూ.2 జిలేబీతో పొట్ట పోషించుకున్నా!

Update: 2018-09-17 01:30 GMT
సినిమా ఒక్కొక్క‌రిని ఒక్కోలా మార్చేస్తుంది. ఒక‌ప్పుడు సింగిల్‌ టీకి డ‌బ్బులేని వాడే ఇప్పుడు బెంజి కార్ న‌డిపినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. యువ‌ద‌ర్శ‌కుడు మారుతి ప‌రిస్థితి కూడా ఇదే. అయితే యాడ్ ఫిలిండైరెక్ట‌ర్‌ గా - చిన్న సినిమాల పంపిణీదారుగా మారుతి ప్ర‌తిదానిని ప్రాక్టిక‌ల్‌ గా చూస్తూ .. ప్రాక్టిక‌ల్‌ గా బ‌త‌క‌డానికే ఇష్ట‌ప‌డ‌డం అత‌డికి నిజంగా ఈ రోజు ఈ స్థాయిని క‌ట్ట‌బెట్టింద‌ని చెప్పాలి. ఈ మాట మ‌నం అన‌డం కాదు, అత‌డే ఏబీఎన్‌- ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర‌మంలో స్వ‌యంగా చెప్పుకొచ్చాడు.

అస‌లు ఈ లైఫ్ ఊహించారా?  ఈరోజుల్లో స‌క్సెస్ కాక‌పోతే మీ ప‌రిస్థితేంటి? అని ప్ర‌శ్నిస్తే ఎంతో ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు మారుతి. ఒక‌వేళ నా మొద‌టి సినిమా `ఈరోజుల్లో` స‌క్సెస్ కాక‌పోతే నేను తిరిగి అదే పాత జీవితాన్ని కొన‌సాగించేవాడిని. రూ.2 జిలేబీ తిని పొట్ట పోషించుకున్న రోజులున్నాయి. రూ.2000తో తినే బిరియాని - రూ.5000 తో తినే బిరియాని - అంత‌కంటే ఎక్కువ ఖ‌ర్చు చేసి తినే బిరియాని.. ఇవ‌న్నీ ఒకే బిరియాని. కాక‌పోతే ప్లేట్ మారుతుంది. యాంబియెన్స్ మారుతుంది అంతే! ఏదీ లేక‌పోతే మూమూలు బ‌తుకే బ‌తికేవాడిని అని తెలిపారు. ఇప్పుడు వ‌చ్చిన‌దంతా బోన‌స్ అని భావిస్తున్నాను. ఒక‌వేళ నాకు జాగ్వార్ లేక‌పోతే ఓ మామూలు మారుతి కొనుక్కుని వెళ్లేవాడినేమో! అని వాస్త‌వాన్ని డౌన్ టు ఎర్త్ నిజాయితీగా చెప్పాడు.

ఈరోజుల్లో సినిమా బ‌డ్జెట్ ఎంత‌? అంటే 52ల‌క్ష‌లు పెట్టామ‌ని - స్నేహితులంతా క‌లిసి ఆ నిర్ణయం తీసుకుని త‌లో 10ల‌క్ష‌లు పెట్టామ‌ని తెలిపారు. ఎవ‌రు ఎంత ఇస్తే అంత‌కు చివ‌ర్లో సినిమాని అమ్మేశామ‌ని - అదృష్ట‌వ‌శాత్తూ అది పెద్ద హిట్ట‌యి కొనుక్కున్న‌వాళ్ల‌కు లాభాలిచ్చింద‌ని తెలిపారు. జాగ్వార్ కార్ ముందు ఫోటో దిగాల‌నుకునేవాడిని. అలాంటిది ఈరోజు జాగ్వార్ కార్‌ లోనే వెళుతున్నానంటే ఇది బోన‌స్ లైఫ్ అనే భావిస్తాన‌ని తెలిపాడు. తాను హిట్టిచ్చాన‌ని ఒకేసారి పెద్ద హీరోల‌తో సినిమా చేయ‌లేన‌ని - నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కిన త‌ర్వాతే స్థాయిని బ‌ట్టి సినిమా చేస్తాన‌ని ప్రాక్టికాలిటీని త‌న‌దైన శైలిలో తెలిపాడు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కులకు మారుతి ఎందుకు ఆద‌ర్శ‌మో ఇప్పుడైనా అర్థ‌మైందా?
Tags:    

Similar News