సినిమాకు పోదాం చలో చలో

Update: 2017-12-21 03:39 GMT
దసరా.. దీపావళి సినిమాల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళ తప్పింది. అందులోనూ గత నెల నుంచి పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పించే సినిమాలే లేకపోయాయి. హౌస్ ఫుల్ అనే మాటే అరుదైపోయింది. ‘గరుడవేగ’.. ‘మెంటల్ మదిలో’.. ‘మళ్ళీ రావా’ లాంటి సినిమాలకు టాక్ అయితే బాగా వచ్చింది కానీ.. అందుకు తగ్గట్లు వసూళ్లు లేవు. వారం వారం లెక్కకు మిక్కిలిగా సినిమాలైతే వచ్చాయి కానీ.. హాళ్లు మాత్రం నిండలేదు. రిలీజులు మరీ ఎక్కువైపోవడంతో జనాలకు మొహం మొత్తేసింది. అన్ని రకాల ఆకర్షణలూ ఉన్న పెద్ద స్థాయి సినిమాల కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు.

ఎట్టకేలకు వారి నిరీక్షణ ఫలించింది. ఈ వారంలో ఒకటికి రెండు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి దిగుతున్నాయి. ముందుగా గురువారం ‘ఎంసీఏ’ రిలీజవుతోంది. గత రెండు మూడేళ్లలో ఇంతింతై అని ఎదిగిపోయి.. వరుస హిట్లతో ఊపుమీదున్న నాని హీరోగా నటించిన సినిమా ఇది. గత కొన్ని వారాలుగా సరైన సినిమాల్లేక వెలవెలబోయిన థియేటర్లకు ఈ సినిమాతో కళ వస్తోంది. ఈ చిత్రాన్ని నాని కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే అయ్యాయి. మరోవైపు శుక్రవారం రాబోతున్న ‘హలో’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. దానికి కూడా పాజిటివ్ బజ్ ఉంది. దాని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. స్లంప్ లో ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్లీ ఈ సినిమాలు కళ తెస్తాయని.. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున థియేటర్లకు రప్పిస్తాయని భావిస్తున్నారు. చూద్దాం మరి వీటి ఫలితాలెలా ఉంటాయో.
Tags:    

Similar News