అరుదైన దృశ్యం: మెగా బ్ర‌ద‌ర్స్ కి త‌ల్లి అంజ‌నాదేవి గోరుముద్దలు

Update: 2021-08-18 04:37 GMT
ఇది నిజంగా అరుదైన దృశ్యం... మెగాభిమానుల‌ క‌ళ్లు చెదిరే త‌నువు పుల‌కించి త‌న్మ‌యానికి గుర‌య్యే రేర్ మూవ్ మెంట్ ఇది. త‌మ అభిమాన దేవుళ్లు మెగాస్టార్ చిరంజీవి... ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముగ్గురూ ఒకే చోట కూచుని పంక్తి భోజ‌నం చేశారు. ఆస‌క్తిక‌రంగా ఆ ముగ్గురికీ వ‌డ్డిస్తూ అక్క‌డే త‌మ మాతృమూర్తి అంజ‌నాదేవి కొణిదెల కూడా భోజ‌నం చేశారు. ఈ అరుదైన దృశ్యం..17-08-22 మంగ‌ళ‌వారం లంచ్ స‌మ‌యంలో క‌నిపించింది. ఇంత‌కీ లొకేష‌న్ ఎక్క‌డ‌? అంటే.. అది హైద‌రాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ఈ సంద‌ర్భం క‌లిసొచ్చింది.

ఇంత‌కీ బ్ర‌ద‌ర్స్ ముగ్గురూ అక్క‌డే ఏం చేస్తున్నారు? అంటే యాథృచ్ఛికంగా అంతా ఒకేచోట షూటింగుల్లో ఉన్నారు. అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి `లూసీఫ‌ర్` రీమేక్ `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ జ‌రుగుతోంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆ ప‌క్క‌నే ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ప‌వ‌న్ -రానా హీరోలుగా సాగ‌ర్ చంద్ర తెర‌కెక్కిస్తున్న భీమ్లా నాయ‌క్ (అయ్య‌ప్ప‌నుమ్ కోషియం) షూటింగ్ ఇది. ఇక ఇదే చోట మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు షూటింగ్ కూడా జ‌రుగుతోంది. దివంగ‌త వెట‌ర‌న్ న‌టి విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ విజ‌య్ కృష్ణ క‌థానాయ‌కుడిగా నాగబాబు కీల‌క పాత్ర‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అయితే ఒకే లొకేష‌న్ లో మెగాబ్ర‌ద‌ర్స్ ముగ్గురూ షూటింగ్ చేయ‌డం యాథృచ్ఛికం అనుకుంటే .. ఆ ముగ్గురూ ఒకే చోట కూచుని లంచ్ చేయ‌డం అంతే క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది. ఇక పంక్తి భోజ‌నం లో త‌న‌యుల‌కు వ‌డ్డించేందుకు త‌మ మాతృమూర్తి అంజ‌నాదేవి కొణిదెల‌ నేరుగా అల్యూమినియం ఫ్యాక్ట‌రీకి విచ్చేయ‌డంతో ఆ దృశ్యం మ‌రింత రంజుగా మారింది. ఇక అంజ‌నాదేవి గారు త‌న‌యుల‌కు క్యారేజీ నుంచి రుచిక‌ర‌మైన వంట‌కాల‌ను వ‌డ్డించారు. ఆ ముగ్గురితో క‌లిసి లంచ్ కూడా చేశారు. ఈ భోజ‌నాల స‌మ‌యంలో మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కూడా అక్క‌డే ఉండ‌డం మ‌రో హైలైట్. ఇక త‌న స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌థానాయ‌కుడిగా సాగ‌ర్ చంద్ర చిత్రీక‌రిస్తున్న మూవీకి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వ‌ ప‌ర్య‌వేక్ష‌కుడిగా ఉన్న సంగ‌తి తెలిసిన‌దే. హారిక హాసిని- సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ అధినేత నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Tags:    

Similar News