మెగాస్టార్ vs కింగ్: బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అంటున్న ఇద్దరు మిత్రులు..!

Update: 2022-07-09 16:30 GMT
సూపర్ సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి - కింగ్ అక్కినేని నాగార్జున మధ్య మంచి సాన్నిహిత్యం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు - నాగ్ ఇద్దరూ స్నేహితులుగానే కాకుండా కుటుంబ సభ్యులుగా మెలుగుతుంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికున్న అనుబంధాన్ని బయట పెడుతూ ఉంటారు. టాలీవుడ్ కు రెండు పిల్లర్స్ గా ఉన్న ఈ ఇద్దరు మిత్రులు ఇప్పుడు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతుండటం ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''గాడ్ ఫాదర్''. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' కు అధికారిక తెలుగు రీమేక్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డేట్ చెప్పలేదు కానీ.. 2022 విజయదశమి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు.

అయితే ఇప్పుడు అదే సీజన్ లో రాబోతున్నట్లు నాగార్జున అనౌన్స్ చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నటిస్తున్న తాజా చిత్రం ''ది ఘోస్ట్''. ఇది అన్ని కమర్షియల్ హంగులతో రూపొందుతున్న హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. శనివారం కిల్లింగ్ మెషిన్ గ్లిమ్స్ ఆవిష్కరించిన మేకర్స్.. దసరా కానుకగా 2022 అక్టోబర్ 5న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

నాగార్జున నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ.. పాత్ బ్రేకింగ్ సినిమా 'శివ' కూడా 1989లో ఇదే రోజున విడుదలైంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 'ది ఘోస్ట్' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఫెస్టివల్ సీజన్ లో రాబోతున్న చిరంజీవి 'గాడ్ ఫాదర్' తో నాగార్జున 'ఘోస్ట్' పోటీ పడాల్సి వస్తోంది.

కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న నాగార్జున - చిరంజీవి.. గతంలో పది సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఒకే తేదీకి ఇద్దరి సినిమాలు రిలీజ్ కాలేదు కానీ.. ఒకే సీజన్ లో నాలుగైదు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాగ్ డెబ్యూ మూవీ 'విక్రమ్' మరియు చిరు 'వేట' సినిమాలు 5 రోజుల వ్యవధిలో మొదటిసారి బరిలో దిగారు.

ఆ తర్వాత 'చంటబ్బాయ్' - 'కెప్టెన్ నాగార్జున'.. 'దొంగ మొగుడు' - 'మజ్ను'.. 'సంకీర్తన' - 'ఆరాధన'.. 'రుద్రవీణ' - 'ఆఖరి పోరాటం'.. 'మురళీకృష్ణుడు' - 'ఖైదీ నెం. 786'.. 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' - 'విజయ్'.. 'కొండవీటి దొంగ' - 'ప్రేమయుద్దం'.. 'ముగ్గురు మోసగాళ్ళు' - 'గోవిందా గోవిందా'.. 'స్టాలిన్' vs 'బాస్' సినిమాలతో నాగ్ - చిరు బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు.

అయితే 2006 తర్వాత వీరిద్దరూ మళ్లీ ఒకే సీజన్ లో తమ సినిమాలను రిలీజ్ చేయలేదు. అలాంటి పరిస్థితి వచ్చినా మాట్లాడుకొని ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతూ వచ్చారు. కానీ ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ యుద్ధానికి సై అంటున్నారు. ఈ ఆసక్తికరమైన పోరు సినీ అభిమానులకు మంచి ట్రీట్ ఇస్తుందనే చెప్పాలి. దసరాకి ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి.. ఈ గ్యాప్ లో విడుదల తేదీల విషయంలో మార్పులు జరుగుతాయేమో చూడాలి.
Tags:    

Similar News