స్వ‌యం కృషీవ‌లుడు మెగాస్టార్‌!

Update: 2022-08-22 07:01 GMT
మెగాస్టార్‌.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు.. ఆయ‌న డ్యాన్స్ ఎర‌గ‌న‌ వారుండ‌రు.. మాస్ ఫైట్స్ కి, డ్యాన్స్ ల‌కు త‌న‌దైన మార్కు హీరోయిజానికి వెండితెర‌పై వ‌న్నె తెచ్చిన హీరో ఆయ‌న‌. అప్ప‌టి వ‌ర‌కు వున్న మూస థోర‌ణికి భిన్నంగా డ్యాన్సులు, ఫైట్స్ తో తెలుగు సినిమాకు స‌రికొత్త సొబ‌గుల‌ద్దారు. తెలుగు సినిమా గురించి చెప్పాల్సి వ‌స్తే చిరంజీవికి ముందు చిరంజీవి త‌రువాత అని చెప్పొకోవాల్సిందే. ఆ స్థాయిలో తెలుగు సినిమాల్లో స‌రికొత్త వొర‌వ‌డుల‌కు శ్రీ‌కారం చుట్టారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు.

మాస్ లో హ్యూజ్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు సుప్రీమ్ హీరో అనిపించుకున్నారు. ఆ త‌రువాత మెగాస్టార్ గా మారి అంద‌రి హృద‌యాల్లో చిరంజీవిగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుని ద‌శాబ్దాల కాలంగా టాలీవుడ్ కు ఏకైక మెగాస్టార్ గా జేజేలు అంటుకుంటూ స్టార్ డ‌మ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన కొణిదెల శివ‌శంక‌ర వ‌ర ప్ర‌సాద్ వెండితెర‌కు చిరంజీవిగా ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న న‌టించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు'. అయితే 'ప్రాణం ఖ‌రీదు' ముందుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఆగ‌స్టు 22న పుట్టిన చిరంజీవి తొలి సినిమా 'ప్రాణం ఖ‌రీదు' 1978 సెప్టెంబ‌ర్ 22న విడుద‌లైంది. ఈ రెండు నెల‌లు, రెండు తేదీలు చిరంజీవికి ఎప్పటికీ ప్ర‌త్యేక‌మే. ఒక‌టి పుట్టిన తేదీ అయితే మ‌రొక‌టి న‌టుడిగా పుట్టిన తేదీ కావడం విశేషం.  ఓ సాధాధ‌ర‌ణ పాత్ర‌తో కెరీర్ ప్రారంభించిన ఆయ‌న ఇక వెనుదిగిరి చూసుకోలేదు. త‌న న‌ట ప్ర‌స్థానాన్ని నిరాటంకంగా కొన‌సాగించారు. ఈ సినిమా కూడా ఆయ‌న‌కు నేరుగా రాలేదు. న‌టుడు సుధాకర్ చేయాల‌నుకున్న సినిమా ఇది. అయితే వేరే సినిమాలో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ పాత్ర చిరంజీవిని వరించింది. అలా సుధాక‌ర్ కార‌ణంగా చిరంజీవి 'ప్రాణం ఖ‌రీదు'తో న‌టుడిగా తెరంగేట్రం చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుంచి చాలా నేర్చుకున్నాన‌ని చాలా సంద‌ర్భాల్లో వెల్ల‌డిచిన చిరు కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవ‌మానాల‌ని ఎదుర్కొన్నార‌ట‌. అమితాబ్ బ‌చ్చ‌న్ ని కూడా కెరీర్ ప్రారంభం లో చాలా మంది అవ‌మానించారు. హైట్‌, డైలాగ్ డెలివ‌రీల విష‌యంలో అబితాబ్ చాలా అవ‌మానాలు ఎదుర్కొన్నారు. ఆయ‌నలాగే త‌ను కూడా అవ‌మానాలు ఎదుర్కొన్నాన‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. చిరు ఎదుగుతున్న క్ర‌మంలో 'ఎవ‌డు వీడు.. ఏ స‌ర్క‌స్ నుంచి తీసుకొచ్చారు.. వంటి అవ‌మాన‌క‌ర మాట‌ల్ని విన్నార‌ట‌. అయితే ఎక్కడా తొంద‌ర ప‌డ‌కుండా త‌న‌ని తాను ప్రూవ్ చేసుకుంటూనే త‌న టాలెంట్ తో విమ‌ర్శ‌ల‌ని తిప్పికొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. కామెంట్ ల వ‌ల్ల త‌న‌లో క‌సి పెరిగి మ‌రింత‌గా ఎద‌గ‌డానికి దోహ‌దం చేసిందంటారు చిరు.

ఇక న‌టుడిగా మెగాస్టార్ కెరీర్ ని 'ఖైదీ' సినిమా మ‌లుపు తిప్పిన విష‌యం తెలిసిందే. హీరోగా ప‌రిచ‌యం అయిన దాదాపు ఐదేళ్ల త‌రువాత 1983, అక్టోబ‌ర్ 23న విడుద‌లైన 'ఖైదీ' సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి అప్ప‌టి వ‌ర‌కు హీరో అంటే ఇలానే వుండాలి అనే బ్యారియ‌ర్స్ ని చెరిపేసి చిరుని స్టార్ ని చేసింది. సిల్వెస్ట‌ర్ స్టాలోన్ న‌టించిన 'ఫ‌స్ట్ బ్ల‌డ్‌' ఆధారంగా ఈ మూవీని తెలుగు నేటివిటీకి మార్చి తెర‌కెక్కించారు. చిరు కెరీర్ లో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఆయ‌న‌ని స్టార్ గా నిల‌బెట్టింది. ఆ త‌రువాత తెలుగు సినిమా ఒర‌వ‌డిని ఆయ‌న త‌నదైన మార్కు సినిమాల‌తో మారుస్తూ వ‌చ్చారు.

రెండు బిరుదులు వున్న హీరోగానూ రికార్డు సొంతం చేసుకున్నారు. కెరీర్ తొలి నాళ్ల‌లో 'సుప్రీమ్ హీరో' గా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకున్నారు. అయితే 1988లో విడుద‌లైన 'మ‌ర‌ణ మృదంగం' సినిమాతో సుప్రీమ్ హీరో కాస్తా 'మెగాస్టార్‌'గా మారిపోయాడు. ఈ సినిమా నిర్మాత కె.ఎస్‌. రామారావు సుప్నీమ్ హ‌రీఓ అనే పేరుని కాస్తా ఈ మూవీతో 'మెగాస్టార్‌'గా మార్చేయ‌డంతో అప్ప‌టి నుంచి అదే పేరు కంటిన్యూ అవుతూ వ‌స్తోంది. 'ప‌సివాడి ప్రాణం' సినిమాతో తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్ ని ప‌రిచ‌యం చేసి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు.

ఫైట్స్ లోనే ప్ర‌త్యేక థీమ్ ని ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త కూడా మెగాస్టార్ చిరంజీవిదే. ఇలా అప్ప‌తిహ‌తంగా సాగుతున్న త‌న సినీ ప్ర‌స్థానానికి 2007 లో బ్రేకిచ్చారు. అది 2017 వ‌ర‌కు కొన‌సాగింది. అంటే ప‌దేళ్ల పాటు చిరు సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌చ్చారు. ఆ త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చి త‌న క్రేజ్‌, త‌న డ్యాన్స్ లో గ్రేస్ ఎక్క‌డా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ క్రేజ్ అలాగే కొన‌సాగుతోంది. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్వ‌యంకృషితో స్టార్ గా, మెగాస్టార్ గా ఎదిగి ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచారు. స్వ‌యంకృషీవ‌లుడు అనిపించుకున్నారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ మూడు భారీ చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో 'గాడ్ ఫాద‌ర్' ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.
Tags:    

Similar News