'లూసిఫర్' ఎన్నిసార్లు చూసినా ఏదో అసంతృప్తిగా అనిపించేది: చిరంజీవి

Update: 2022-10-04 10:39 GMT
మెగాస్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" మూవీ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. దసరా కానుకగా రేపు (అక్టోబర్ 5) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మలయాళంలో ఘనవిజయం సాధించిన మోహన్ లాల్ 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా "గాడ్ ఫాదర్" తెరకెక్కింది. మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తగినన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ మెగా అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో.. తెలుగుతో పాటుగా హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ముంబైలోనూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో చిత్రబృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. "ఒకే తరహా సినిమాలు కాకుండా డిఫరెంట్ గా ఏదైనా చేయాలని అనుకుంటున్న సమయంలో.. ఒకరోజు చరణ్ వచ్చి మలయాళ మూవీ 'లూసిఫర్' చూశారా? అని అడిగాడు. చూసాను.. డిఫరెంట్ గా చేశారు. చాలా బాగుంది అన్నాను. మీ కోసం ఆ సినిమాని తీసుకుందామని అనుకుంటున్నాను అని చరణ్ చెప్పాడు"

"అప్పుడు నాకు ఆలోచన మొదలైంది. వ్యత్యాసం కోరుకుంటున్నప్పుడు ఇలాంటి సినిమా కదా మనం చేయాల్సింది అనిపించింది. మళ్లీ 'లూసిఫర్' చూసా. ఎన్నిసార్లు చూసినా.. ఎక్కడో కొంత డౌట్ డౌట్ గా ఉండేది. ఇదేంటి అంతా కరెక్ట్ గానే ఉందా? ఏంటి సగంలో ఆపేశారు.. పూర్తిగా నాకు అర్ధం కావడం లేదు అనిపించింది. తెలుగు వెర్సన్ చూసినా సరే పూర్తి సంతృప్తిగా అనిపించలేదు"

"నా ఇమేజ్ కు అనుగుణంగా సంతృప్తిపరిచేలా ఎవరైనా మార్పులు చేస్తారా అని ఆలోచిస్తూ సత్యానంద్ లాంటి వారిని కూడా ఇన్వాల్వ్ చేశాను. ఒకసారి మోహన్ రాజా అయితే బాగుంటుంది అని చరణ్ మరియు ఎన్వీ ప్రసాద్ చెప్పారు. రాజా వచ్చి చేసిన పెద్ద మార్పులతోటి తృప్తి కలిగింది. కచ్చితంగా ఇది చేయదగ్గ సినిమా అనుకున్నాను"

"సినిమా చూస్తున్నప్పుడు సాంగ్స్ లేవెంటి? హీరోయిన్ లేదేంటి? వంటి ఆలోచనలు రావు. క్యారక్టర్స్ డిజైన్ చేసిన విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వెంటనే నెక్స్ట్ ఫ్రేమ్ కి వెళ్లిపోతామే తప్ప.. పక్కకి డైవర్ట్ అయ్యే అవకాశమే లేకుండా రాజా చాలా అద్భుతంగా మలిచాడు. ఏంటి.. ఇలా ఉందని నిరాశ పడే అవకాశమే లేదు"

"గాడ్ ఫాదర్ కచ్చితంగా మీ ప్రేమ పొందుతుంది.. దీన్ని అందరూ ఆదరిస్తారు అని గట్ ఫీలింగ్ ఉంది నాకు. అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారంటే ఈ సినిమా భవిష్యత్ ఏంటో నాకు ముందుగానే తెలుస్తోంది. ఈ సినిమాకి పనిచేసిన వారందరూ డబ్బు కోసం చేయలేదు.. తృప్తి కోసం చేశారు. ఇది విజయదశమికి అందరికీ విజయం అందిస్తుందని నమ్ముతున్నాను" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర సమాధానాలిచ్చారు. 'గాడ్ ఫాదర్' సినిమాలో ప్రస్తుత రాజకీయ నేతలపై ఎలాంటి సెటైర్లు వేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ డైలాగులు విని ఎవరైనా భుజనాలు తడుముకుంటే తానేమీ చేయలేనని చిరు వ్యాఖ్యానించారు. ఈ ప్రెస్ మీట్ కి బ్రహ్మాజీ - సత్యదేవ్ - సత్యానంద్ - మోహన్ రాజా - రచయిత లక్ష్మీ భూపాల్ మరియు నిర్మాత ఆర్బీ చౌదరి హాజరయ్యారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full View
Tags:    

Similar News