సినీ కార్మికుల కోసం చిత్ర‌పురిలో మెగాస్టార్ ఆసుప‌త్రి

Update: 2022-08-20 06:02 GMT
సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో యాక్టివ్ గా పాల్గొంటారు. ఇప్ప‌టికే చిరంజీవి  బ్ల‌డ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో నిరుపేద‌ల‌కు ర‌క్తాన్ని అందిస్తున్నారు. అందులో అభిమానుల స‌హకారం ఎంతో గొప్ప‌ది. చిరంజీవి ప్ర‌తీ పుట్టిన రోజుకి  తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ర‌క్త‌దాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు.

ఇలా చిరు-అభిమానులు క‌ల‌వ‌డంతోనే ఇదంతా సాధ్య‌మ‌వుతుంది. ఇక వ్య‌క్తిగ‌తంగా మెగాస్టార్ స‌హాయ కార్య‌క్ర‌మాలు నిరంత‌రం కొన‌సాగుతూనే ఉంటాయి. కోవిడ్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కి ఉచితంగా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను స‌ర‌ఫర చేసి మాన‌వ‌తా దృక్ఫ‌ధాన్ని చాటుకున్నారు. అందుకోసం  కొన్ని కోట్ల రూపాయ‌లు వెచ్చించారు. తాజాగా మెగాస్టార్ సినీ కార్మికుల కోసం న‌డుం బిగించారు.

ఈనెల 22న చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా కార్మికుల‌కు చిరు గుడ్ న్యూస్ చెప్పారు. త‌న తండ్రి పేరిట కార్మికుల కోసం ఓ ఆసుప‌త్రిని నిర్మిస్తాన‌ని  ప్ర‌క‌టించారు. సెల‌బ్రిటీ క్రికెట్ కార్న్ వాల్  ట్రోపీ..జెర్సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన  చిరంజీవి ఈ వ్యాఖ్య‌లు చేసారు.  

''సినిమా తీయ‌డంలో ఎంతో మంది శ్ర‌మిస్తారు. అలాంటి కార్మికుల కోసం ఈ ఆసుప‌త్రి నిర్మాణానికి పూనుకున్నాను.  కెరీర్ ఆరంభంలో ప్ర‌తీ ఒక్క‌రూ స్వార్ధంగా ఉండ‌టం స‌హ‌జ‌మే. బాగా సంపాదించాల‌ని..జీవితాంతం క‌ష్టాలు లేకుండా ఉండాల‌నుకుంటారు. కానీ జీవితం ఒక దశ‌కు వ‌చ్చిన త‌ర్వాత  ఎదుట‌వారికి స‌హాయం చేయాల‌నే భావ‌న క‌లుగుతుంది.

క‌ష్టాల్లో ఉన్న‌వాడి ఆక‌లి తీరిన‌ప్పుడు క‌లిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ విష‌యం నాకు అనుభ‌వ పూర్వ‌కంగానే తెలిసింది. మొట్లో నేను  మంచి కార్లు..విదేశాలు తిర‌గాలి. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకున్న వాడినే. అలాగే నా పారితోషికం పెరుగుతూ వ‌చ్చింది. ఇవ‌న్నీ నాకు వ‌చ్చాయంటే ప్రేక్ష‌కాభిమానులే కార‌ణం.

అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాల‌ని బ్ల‌డ్ బ్యాంక్ స్థాపించా. అది ఇప్ప‌టికీ న‌డుస్తుంది. సినిమా స‌క్సెస్ అయిన‌ప్ప‌టి కంటే ఎదుట వారికి స‌హాయం చేస్తే ఎక్కువ తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నానంటే  దానికి  కార‌ణం సినీ ప‌రిశ్ర‌మే. అందుకే సినిమా కోసం శ్ర‌మిస్తున్న  కార్మికుకు చిత్ర‌పురి కాల‌నీలో 10 పడ‌క గ‌దుల ఆసుప‌త్రి  మా నాన్న గారు కొణిదెల వెంక‌ట్రావు పేరుతో నిర్మిస్తాన‌ని మాటిస్తున్నా.

వ‌చ్చే ఏడాది ఇదే స‌మ‌యానికి ప‌నుల ప్రారంభిస్తాం. ఆసుప‌త్రి నిర్మాణంలో ఎవ‌రైనా భాగం అవ్వాల‌నుకుంటే అవ్వొచ్చు. ఎన్నికోట్లు అయినా పెట్ట‌గ‌లే శ‌క్తి ఆ బ‌గ‌వంతుడు నాకిచ్చాడు. ఆసుప‌త్రి ఏర్పాటు నా ప్రాథ‌మిక బాధ్య‌త‌గా భావిస్తున్నాను' అని అన్నారు. దీంతో సంగీత ద‌ర్శ‌కుడు త‌న వంతుగా ఓ మ్యూజిక‌ల్ షోన్ ఏర్పాటు చేసి దాని ద్వారా వ‌చ్చిన డ‌బ్బుని ఆసుప‌త్రి నిర్మాణానికి విరాళంగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు.
Tags:    

Similar News