యుఎస్ లో మెహ్రీన్ కు షాక్

Update: 2018-06-17 05:45 GMT
యుఎస్ వేదికగా బయటపడిన టాలీవుడ్ వ్యభిచారం రాకెట్ అసలు ఏ కనెక్షన్ లేని ఇతర హీరోయిన్లకు కూడా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. మోదుగుమూడి దంపతులు నడిపిన ఈ రొంపిలో నిజంగా ఎవరున్నారు అనే పేర్లు అక్కడి అఫీషియల్స్ విడుదల చేయలేదు కానీ తెలుగు పరిశ్రమ నుంచి రకరకాల కారణాలతో అక్కడ అడుగు పెడుతున్న నటీమణులకు కొత్త రకం చిక్కులు వచ్చి పడుతున్నాయి. వీటిని  మొదటగా ఫేస్ చేసింది సిల్కీ బ్యూటీ మెహ్రీన్. గోపిచంద్ తో పంతం షూటింగ్ ని  ఇటీవలే పూర్తి చేసుకున్న మెహ్రీన్ వెకేషన్ కోసం యుఎస్ కు వెళ్ళింది. అక్కడ తన స్నేహితులను బంధువులను కలిసాక తిరిగి కెనడా వెళ్లేందుకు ఎయిర్ పోర్ట్ కు రాగా మెహ్రీన్ టాలీవుడ్ హీరోయిన్ అని గుర్తించిన పోలీసులు తనను 30 నిమిషాల పాటు విచారించినట్టు తెలిసింది. ఇక్కడికి ఎందుకు రావలసి వచ్చింది, కెనడా ట్రిప్ కు కారణాలు ఏంటి లాంటి ప్రశ్నలతో పాటు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో ఉన్న ప్రాస్టిట్యూషన్ కేసు గురించి ఏదైనా అవగాహనా ఉందేమో అడిగినట్టు తెలిసింది. ఇది స్వయంగా మెహ్రీన్ షేర్ చేసుకోవడంతో విషయం ప్రపంచానికి తెలిసింది.

తనకు ఈ విషయం గురించి అవగాహన లేదని పోలీసులు చెప్పాక కానీ ఈ రాకెట్ లో కొందరు హీరోయిన్లు ఉన్నారనే చేదు నిజం తెలిసిందని చెప్పింది మెహ్రీన్. వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నంత సేపు చాలా ఇబ్బందిగా అనిపించిందని అసలు ఏ సంబంధం లేని తనలాంటి వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ  ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చూస్తుంటే టాలీవుడ్ తరఫున అమెరికాలో ఎవరు అడుగు పెట్టినా వాళ్ళ మీద తీవ్ర నిఘా కొనసాగేలా ఉంది. ఇప్పటికే అక్కడ ఈవెంట్స్ కోసం ఉన్న ముగ్గురు హీరోయిన్లను ఆరు గంటల పాటు విచారించారని వచ్చిన వార్తలు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో మెహ్రీన్ చెప్పినదాన్ని బట్టి చూస్తే ప్రమేయం లేకున్నా సరే తెలుగు సినిమా హీరోయిన్ అనే ట్యాగ్ ఉంటే చాలు  విచారణ ఎదుర్కోవాల్సిన ఉంటుంది . ఇకపై ఉత్సవాలు సంబరాలు వేడుకలు అంటూ రకరకాల సంఘాల పేరుతో ఏ ఆహ్వానాలు వచ్చినా హీరోయిన్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి  వచ్చేసింది. గత రెండేళ్లుగా ఏదో ఒక వివాదంతో నలిగిపోతున్న టాలీవుడ్ కు ఇప్పుడు జరుగుతున్న పరిణామమే పెద్దది అని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని సినిమా వర్గాలు ఎదురుచూస్తున్నాయి.


Tags:    

Similar News