కల్లోలం నెలకొన్న వేళ బాధ్యత లేని మీమ్స్?

Update: 2020-04-07 22:30 GMT
సోషల్ మీడియాలో మీమ్స్.. జోకులు.. ట్రోలింగ్ సాధారణమైన విషయమే. అయితే సాధారణ పరిస్థితుల్లో సాధారణ విషయాల మీద మీమ్స్ తయారు చేయడం తప్పేమీ కాదు కానీ ప్రస్తుతం కరోనావైరస్ వల్ల నెలకొన్న పరిస్థితుల్లో బుద్ధిలేని మీమ్స్ తయారు చెయ్యడం పై విమర్శలు వస్తున్నాయి.  ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ వారు చాలామంది ఈ మీమ్స్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్-19 కేసులు పెరగడం కారణంగా భారతదేశంలో లాక్ డౌన్ విధించారు. దీంతో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి.  ఎంతోమంది ఉపాధి కోల్పోయారు.  కొందరు తమ సొంత ఊర్లకు పోవడానికి వీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కరోనా బాధితుల విషయంలో సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తూ.. కొన్ని డిజిటల్ మీడియా సంస్థలు అర్థం లేని మీమ్స్ తయారు చేస్తున్నాయి. ఈ మీమ్స్ కు ముడిసరుకు ఎక్కువ భాగం సినిమాలలోని క్లిప్స్ లేదా.. ఫిల్మీ ఈవెంట్లలో.. ఇతర ఇంటర్వ్యూలలో ప్రముఖులు మాట్లాడిన వీడియో క్లిప్పులే. దీంతో సోషల్ మీడియాలోనే ఈ మీమ్ పేజీలపై సినీ ప్రముఖులలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

చిన్నవార్తలను పెద్దగా చేసి చూపించడం.. విషాదకరమైన సంఘటనలపై మీమ్స్ తయారు చేయడం.. ఫేక్ మెసేజిలను.. వీడియోలను ప్రచారంలోకి తీసుకురావడం పట్ల సాధారణ ప్రజలలో కూడా అసహనం పెరుగుతోంది.  ఏదేమైనా కామెడీ చెయ్యాల్సిన సమయంలో చేస్తే అందరికీ నవ్వు వస్తుంది. కానీ సమయం సందర్భం లేకుండా.. ప్రజలలో ఎక్కువమంది భయాందోళనలతో ఉన్న విషయంపై పిచ్చ జోకులు వెయ్యడం.. ప్రధాని.. ముఖ్యమంత్రులు కరోనాపై చేసిన వ్యాఖ్యలు.. చెప్పిన జాగ్రత్తలపై అనవసరపు కామెడీ చెయ్యడం బాధ్యతలేనితనమేననే వాదన వినిపిస్తోంది. ఇలాంటివాటికి సినిమాల క్లిప్పులు వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఫిలిం ఇండస్ట్రీలో కొందరు కోరుతున్నారు.


Tags:    

Similar News