మినీ రివ్యూ: 'డార్లింగ్స్'

Update: 2022-08-06 08:13 GMT
ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోతున్నాయి. ఒకటీ అరా తప్పా మిగతా చిత్రాలేవీ పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేక బోల్తా కొడుతుంటే.. నేరుగా ఓటీటీలో విడుదలైన చిత్రాలు కూడా ఆడియన్స్ ను నిరాశ పరుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ స్వీయ నిర్మాణంలో రూపొందిన ''డార్లింగ్స్'' అనే హిందీ సినిమా డిజిటల్ వేదిక మీదకొచ్చింది.

ఆలియా భట్ - షెఫాలీ షా - విజయ్ వర్మ - రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ''డార్లింగ్స్''. జస్మిత్ కె. రీన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలియా ఒక నిర్మాతగా వ్యవహరించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎటర్నల్ సన్షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేశారు

ప్రమోషనల్ కంటెంట్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన 'డార్లింగ్స్' సినిమాపై అదే స్థాయిలో అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. ట్రైలర్ చూసిన తర్వాత మగాళ్లపై గృహహింసని ప్రమోట్ చేస్తున్నారా అంటూ నెటిజన్లు విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా #BoycottAliaBhatt అనే హ్యాష్ ట్యాగ్‌ తో ట్రెండ్ చేశారు. రిలీజ్ కు ముందే వివాదానికి తెర లేపిన ఈ సినిమా.. ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుందో ఇప్పుడు చూద్దాం!

'డార్లింగ్స్' కథలోకి వెళ్తే.. తల్లే (షెఫాలీ షా) ప్రపంచంగా జీవించే బద్రునిసా ఆలియాస్ బద్రు (ఆలియా భట్).. రైల్వే టికెట్ కలెక్టర్ హంజా (విజయ్ వర్మ) ని వివాహం చేసుకుంటుంది. మద్యానికి బానిసైన హంజా.. చీటికీ మాటికీ ఆమెను కొడుతుంటాడు. భార్యను అనుమానించి చిత్ర హింసలకు గురి చేస్తాడు. అయితే తన భర్తను బాగు చేయాలని తమ వైవాహిక జీవితం సవ్యంగా జరిగేలా చూసుకోవాలని బద్రు ఓ ప్లాన్ చేస్తుంది. అది భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య మరింత దూరం పెరుగుంది. దీంతో భర్త నుంచి శాశ్వతంగా విడిపోవాలని నిర్ణయించుకున్న భద్రు.. తన తల్లితో కలిసి ఎలాంటి పన్నాగం పన్నింది? దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి?   ఈ భార్యా భర్తల కథ చివరకు ఎలా ముగిసిందనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో భార్యా భర్తల మధ్య జరిగే గొడవలను ఇతివృత్తంగా తీసుకుని ఓ డార్క్ కామెడీగా 'డార్లింగ్స్' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. కథ పాతదే అయినా కొత్తగా చూపించాలని ట్రై చేశారు. అలియా - విజయ్ వర్మ పెళ్లి గురించి మాట్లాడుకునే సన్నివేశంతో సినిమాని ఓపెన్ చేసి.. వెంటనే మూడేళ్ళ తర్వాత వారి వైవాహిక జీవితం గురించి చూపించారు.

కేవలం నాలుగు ప్రధాన పాత్రలతో సినిమా మొత్తాన్ని నడిపించారు. భార్యాభర్తల మధ్య రోజూ గొడవలు జరగడం.. సారీ చెప్పుకోవడం.. ఇలాంటి రిపీటెడ్ సన్నివేశాలతోనే ఫస్ట్ హాఫ్ ని నడిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారు. భర్త పురుషాహంకార ధోరణిని అణచివేయాలని భార్య వేసే ప్లాన్స్ గతంలో పలు సూపర్ హిట్ చిత్రాలను గుర్తుచేస్తాయి.

సెకండాఫ్ లో విజయ్ వర్మ పాత్ర మంచిగా మారిపోతుందని భావించే సమయంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. అలానే క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని మలుపు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలు మరీ అస్పష్టంగా అసంపూర్తిగా ఉన్నాయి. చిన్న పాయింట్ ని తీసుకొని సాగదీసే క్రమంలో మెయిన్ పాయింట్ ని స్ట్రాంగ్ గా ఆసక్తికరంగా చెప్పలేపోయారు.
 
అలియా భట్ మధ్య తరగతి గృహిణిగా మంచి నటన కనబరిచింది. విజయ్ వర్మ - షెఫాలీ షా తమ తమ పాత్రలతో మెప్పించారు. బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ పర్వాలేదనిపించాయి. అలియా పెర్ఫార్మన్స్ - సినిమాలో ట్విస్టులు - క్లైమాక్స్ హైలైట్ గా నిలిస్తే.. స్లో నేరేషన్ - ఫస్ట్ హాఫ్ డ్రాబ్యాగ్స్ చెప్పాలి. డార్క్ కామెడీ అని ప్రచారం చేశారు కాబట్టి.. మరీ డార్క్ ఎక్సపెక్ట్ చేసి సినిమా చూస్తే మాత్రం నిరాశ తప్పదు. ఓటీటీ సినిమా కాబట్టి స్కిప్ చేస్తూ ఒకసారి చూడొచ్చు.
Tags:    

Similar News