ప్రభాస్ హాలీవుడ్ మూవీ రూమర్స్ పై స్పందించిన 'మిషన్ ఇంపాజిబుల్' డైరెక్టర్..!

Update: 2021-05-26 10:30 GMT
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఓ హాలీవుడ్ సినిమాలో న‌టించ‌బోతున్నార‌నే వార్తొక‌టి గత రెండు రోజులుగా నెట్టింట తెగ హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. క్రిస్టోఫ‌ర్ మెక్ క్వారీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ‘మిష‌న్ ఇంపాజిబుల్ 7’ చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడనేది ఈ వార్త సారాంశం. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్‌ తో క‌లిసి ప్ర‌భాస్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్స్ డైరెక్టర్ నుంచి క్లారిటీ వచ్చింది.

ఓ నెటిజన్ డైరెక్టర్ క్రిస్టోఫ‌ర్ మెక్ క్వారీ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వమని కోరాడు. ''MI7 లో కీలక పాత్ర కోసం ప్రభాస్ అనే భారతీయ నటుడిని తీసుకున్నారు అనే ఓ న్యూస్ భారత వార్తా ఛానెళ్లలో ట్రెండింగ్ అవుతోంది. దయచేసి ఇది నిజమో కాదో కన్ఫర్మ్ చేయగలరా?'' అని హాలీవుడ్ దర్శకుడిని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన దర్శకుడు ఇందులో నిజం లేదని సమాధానం ఇచ్చారు. “అతను చాలా ప్రతిభావంతుడైన వ్యక్తి.. అయితే మేము ఎప్పుడూ కలవలేదు. వెల్ కమ్ టూ ఇంటర్నెట్” అని క్రిస్టోఫ‌ర్ మెక్ క్వారీ ట్వీట్ చేశారు.

దీంతో ప్రభాస్ హాలీవుడ్ సినిమాలో నటించడం లేదనే విషయం పై స్పష్టత వచ్చింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహానికి గురైనప్పటికీ.. అదే సమయంలో ప్రభాస్ ను ఓ హాలీవుడ్ డైరెక్టర్ 'టాలెంటెడ్ మ్యాన్' అన్నందుకు వారు ఖుషీ అవుతున్నారు. ఇకపోతే టామ్ క్రూజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా ''మిషన్ ఇంపాజిబుల్ 7'' రూపొందుతోంది. 'MI7' చిత్రం 2022 మే 27న విడుదల కానుంది. భవిష్యత్తులో 'మిషన్ ఇంపాజిబుల్' కు కొనసాగింపుగా మరో రెండు సినిమాలు కూడా రావచ్చని సమాచారం.
Tags:    

Similar News