ఆ సమయంలో భయపడ్డ 'రాధేశ్యామ్‌' రచయిత!

ప్రభాస్ అభిమానులు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి సినిమా మేకర్స్‌పై దుమ్మెత్తి పోసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Update: 2025-01-23 06:08 GMT

ప్రభాస్ హీరోగా వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా విడుదలకు ముందు చాలా విమర్శలు ఎదుర్కొంది. ముఖ్యంగా సినిమా నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ వారిని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున విమర్శించారు. సినిమాలను తీయడం మానేసి మరేదైనా పని చేసుకోమని సోషల్‌ మీడియా ద్వారా చాలా దారుణమైన ట్రోల్స్ చేయడం మనం చూశాం. ఒకానొక సమయంలో బ్యాన్‌ యూవీ క్రియేషన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఎక్స్ ద్వారా జాతీయ స్థాయిలో ట్రెండ్‌ చేశారు. ప్రభాస్ అభిమానులు ఒకానొక సమయంలో సహనం కోల్పోయి సినిమా మేకర్స్‌పై దుమ్మెత్తి పోసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఆ సమయంలోనే విడుదలైన నే నిన్నటి రవి.. అంటూ సాగే పాట విడుదలైంది. మొదట పాటకు పెద్దగా పాజిటివ్‌ టాక్ దక్కలేదు. ఎందుకంటే సోషల్‌ మీడియాలో ఆ పాటను ఎక్కువగా ప్రచారం చేయలేదు. ఆ పాట రచయిత కృష్ణకాంత్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో పెరిగి పోయిన నెగిటివిటీ ట్రోల్స్ ఇతర విషయాల కారణంగా ఏ విషయాన్ని షేర్‌ చేయాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. రాధేశ్యామ్‌లోని తాను రాసిన నే నిన్నటి రవిని... అనే పాటను విడుదల సమయంలో సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేయాలని అనుకున్నా చేయలేక పోయాను. ఆ పాటను నాది అని చెప్పుకోవడానికి భయం వేసిందని అన్నాడు.

ఆ పాటలోని సాహిత్యం అర్థం కాకుంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కడ బూతులు తిడతారో అనే ఉద్దేశ్యంతో షేర్‌ చేసుకోలేదు. అయితే ఆ తర్వాత పాటకు మంచి స్పందన వచ్చింది. సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేసి ఉంటే ఇంకాస్త ముందుగానే పాటకు మంచి స్పందన వచ్చి ఉండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగానే ఆ పాట ముందుగా రీచ్ కావాల్సి ఉన్నా ఆలస్యం అయ్యిందని అన్నాడు. సోషల్‌ మీడియా ద్వారా ఏమైనా షేర్ చేయాలి అంటే నెగిటివిటీకి సెలబ్రెటీలు భయపడుతున్నారు అంటూ రచయిత కృష్ణకాంత్ తన అనుభవంను చెప్పుకొచ్చారు.

హీరోలు, హీరోయిన్స్‌, దర్శకులు ఇలా ఎవరు ఏం పోస్ట్‌ చేసినా ఒక వర్గం వారు దాన్ని ట్రోల్స్ చేసేందుకు ముందు ఉంటున్నారు. కొందరు సోషల్ మీడియా అకౌంట్స్ వదిలేసి పారిపోయిన వారు ఉన్నారు. బాబోయ్ మాకు ఈ సోషల్‌ మీడియా వద్దు అంటూ దూరంగా జరిగిన వారు ఉన్నారు. మొత్తానికి సోషల్‌ మీడియా ద్వారా మంచి జరగడంతో పాటు కొందరి అత్యుత్సాహం వల్ల చెడు కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో కొందరిని ఓవర్‌ నైట్‌లో సెలబ్రెటీని చేస్తే, కొందరిని అదే సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని పాతాళానికి తొక్కిన సందర్భాలు ఉన్నాయి. అందుకే సెలబ్రెటీలు సోషల్‌ మీడియా పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సాధ్యం అయినంత వరకు తమ స్పందన చెప్పకుండా, ఏ విషయాన్ని షేర్‌ చేయకుండానే ఉంటున్నారు.

Tags:    

Similar News