వారు..నికృష్ఠులు: మోహ‌న్ బాబు

Update: 2018-02-15 13:46 GMT
టాలీవుడ్ - బాలీవుడ్ - హాలీవుడ్ - మాలీవుడ్.....ఇలా అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను ప‌ట్టి పీడిస్తోన్న ప్ర‌ధాన స‌మ‌స్య పైర‌సీ. గ‌తంలో సినిమా విడుద‌లైన 2-3 రోజుల‌కు అతి త‌క్కువ సంఖ్య‌లో సీడీలో డీవీడీలో రిలీజ‌య్యేవి. ప్ర‌స్తుతం టెక్నాల‌జీ పెరిగిపోయిన నేప‌థ్యంలో విడుద‌లైన గంట‌ల్లోనే సినిమా ఆన్ లైన్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతోంది. దీంతో కలెక్ష‌న్ల‌పై పైర‌సీ ప్ర‌భావం తీవ్రంగా ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో సినిమా విడుద‌లైన కొద్ది రోజుల త‌ర్వాత పైర‌సీ చేసుకోవాల‌ని ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేశాడంలే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్ప‌వ‌చ్చు. రెండు రోజుల క్రితం టాలీవుడ్ ర‌చ‌యిత కోన వెంక‌ట్.....పైర‌సీ వెబ్ సైట్ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్వీట్ చేశారు. తాజాగా, ఈ పైర‌సీ భూతంపై క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఘాటుగా స్పందించారు. పైర‌సీకి పాల్ప‌డ్డ‌వారికి కూడా కుటుంబం ఉంటుంద‌ని - పైర‌సీ చేసిన పాపానికి వారు నాశ‌న‌మైపోతార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, పైర‌సీని చూసిన వారు కూడా నీచాతినీచుల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాయ‌త్రి స‌క్సెస్ మీట్ సంద‌ర్భంగా మోహ‌న్ బాబు ఈ అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఓ చిత్ర నిర్మాతగా పైర‌సీ విషయంలో త‌న‌ హృదయం ఏడుస్తోంద‌ని - నిర్మాత కష్టసుఖాలు జర్నలిస్టులకు - ప్రజలకు తెలుస‌ని అన్నారు. 42 సంవత్సరాల నట జీవితం ఉన్న మోహ‌న్ బాబు చెబితే కొంద‌రైనా వింటారేమో అన్నఆశ‌తో ఇదంతా చెబుతున్నాన‌ని అన్నారు. నిర్మాతగా - నటుడిగా గాయ‌త్రి సినిమా కోసం 9 నెలలు కష్టపడ్డాన‌ని - చేయి ఆపరేషన్ - మరో ఆపరేషన్ జ‌రిగిన‌ప్ప‌టికీ వ‌య‌సును కూడా లెక్క‌చేయ‌కుండా రిస్కీ ఫైట్స్ చేశానన్నారు. తాము నిర్మాణ‌రంగంలో సక్సెస్ ఫుల్ అని - వ్యాపారంలో ఫెయిల్యూర్స్ అనేవి సహజమ‌ని అన్నారు. పైరసీ చేసే వారిని దొంగలారా...స్నేహితులారా - నీచురాలా - పోరంబోకులారా - దుర్మార్గులారా అని నోటిని అపవిత్రం చేసుకోకూడ‌ద‌న్నారు. దుర్మార్గుడిగా - పైర‌సీ చేసేవాడిగా బ్రతకమని ఏ తల్లీ చెప్పద‌న్నారు. నీచాతి నీచంగా డీవీడీలు - ఆన్ లైన్ పైరసీ ప్రింట్ లు చూడొద్ద‌ని ప్రేక్ష‌కుల‌కు హిత‌వు ప‌లికారు. పైర‌సీ చేసేవారు నికృష్టుల‌ని - చూసి ఎంకరేజ్ చేసేవారు మహా నికృష్ఠుల‌ని - అటువంటి వారుంటే దేశం - ఇండస్ట్రీ ముందుకు వెళ్ల‌వ‌న్నారు. ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్ల పైరసీ వచ్చినా ఇంత ఘోరంగా రావన్నారు.

ప్ర‌స్తుతం తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాద‌ని - కొన్ని వార్తలను చూసి రాజ‌కీయాల‌కు సంబంధించిన డైలాగులు మాత్ర‌మే సినిమాల్లో పెడ‌తామ‌న్నారు. సమయం వచ్చినపుడు తాను ఏ పార్టీకి చెందిన వాడినో చెబుతాన‌ని అన్నారు. ఈ మ‌ధ్య చాలా టీవీ సీరియల్స్ లో ఆడ విలన్స్ ఎక్కువ‌య్యార‌ని - వాటినే ఆడ‌వాళ్లు కూడా ఎక్కువగా చూడ‌డం బాధాక‌రమ‌ని, త‌న భార్యతో పాటు కొంద‌రు ఆడపడుచుల‌నుద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేశాన‌న్నారు. `గాయ‌త్రి` క‌లెక్ష‌న్స్ ఒక‌చోట ఎక్కువ‌గా - మరో చోట త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ నిర్మాత‌గా తాను సేఫ్ అని అన్నారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ తో వ‌చ్చిన ఈ సినిమాకు వ‌చ్చిన అభినంద‌నలు త‌న కెరీర్ లో మ‌రో సినిమాకు రాలేదని - త‌నపై ప్రేక్ష‌కుల అభిమానం క‌ల‌కాలం ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని మోహన్ బాబు అన్నారు.
Tags:    

Similar News