‘‘ముద్దబంతి పువ్వులో.. మూగకళ్ల ఊసులో.. వెనుక జనమ బాసలు ఎందరికీ తెలుసులే’’... మూగమనసులు సినిమాలోని ఈ పాట ఎవర్ గ్రీన్. ఎప్పుడు విన్నా ఆనాటి గొప్పనటులయిన ఏఎన్ఆర్.. సావిత్రిల నటనా వైదుష్యం కళ్లముందు కదలాడుతుంది. పెదవి దాటని మూగ ప్రేమను కళ్లతోనే అభినయించిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
ఆ మూగమనసులు ఫీల్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మహానటి టీం సిద్ధమవుతోంది. సావిత్రి జీవిత గాథతో తెరకెక్కిన ఈ సినిమాలో మూగమనసులు టైటిల్ తో ఓ సాంగ్ చిత్రీకరించారు. మిక్కీ జె.మేయర్ మ్యూజిక్ అందించిన ఈ ఎటర్నల్ లవ్ సాంగ్ గురించి మహానటి యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సినిమాలో జెమినీ గణేశన్ పాత్ర పోషిస్తున్న దుల్కర్ సల్మాన్.. సావిత్రి రోల్ చేస్తున్న కీర్తి సురేష్ ల షాడో బ్యాక్ డ్రాప్లో పెట్టిన ఫొటోతో పెట్టిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈనెల 20న ఈపాటను రిలీజ్ చేయబోతున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న మహానటి మే 9న థియేటర్లకు రానుంది. ఈ సినిమాలో సమంత మదురవాణి అనే జర్నలిస్టు పాత్ర చేస్తుండగా విజయ్ దేవరకొండ ఆమె అసిస్టెంట్ గా స్పెషల్ రోల్ చేస్తున్నాడు.