మూవీ రివ్యూ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Update: 2021-10-15 13:37 GMT
చిత్రం : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’

నటీనటులు: అఖిల్ అక్కినేని-పూజా హెగ్డే-ఆమని-జయప్రకాష్-ఈషా రెబ్బా-ఫరియా అబ్దుల్లా-మురళీ శర్మ-పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: ప్రదీప్ వర్మ
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్

తొలి మూడు సినిమాలతో తీవ్ర నిరాశకు గురైన అక్కినేని కుర్రాడు అఖిల్.. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆసక్తికర ప్రోమోలతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ఈ చిత్రం దసరా కానుకగా ఈ రోజే విడుదలైంది. మరి ఆ అంచనాలను ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

హర్ష (అఖిల్) న్యూయార్క్ లో ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడ్డ కుర్రాడు. జీవితంలో అతడికి కావాల్సినవన్నీ ఉంటాయి. దేనికీ లోటుండదు. పెళ్లి చేసుకోవాల్సిన వయసు రావడంతో ఇండియాకు ‘పెళ్లిచూపుల’ ట్రిప్ వేస్తాడు. 20 రోజులు అక్కడే ఉండి కొందరమ్మాయిల్ని చూసి అందులో నచ్చిన అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ జాతకం కుదరక పెళ్లి వద్దనుకున్న విభా (పూజా హెగ్డే) వ్యక్తిత్వం అతడికి బాగా నచ్చేస్తుంది. ఆమె కారణంగానే మిగతా అమ్మాయిలెవ్వరూ అతడికి నచ్చరు. ఈ క్రమంలో హర్ష కుటుంబంలో సమస్యలతో తలెత్తుతాయి. మరోవైపు విభాకు కూడా హర్ష నచ్చడు. దీంతో పెళ్లి గిల్లీ వద్దనుకుని తిరిగి యుఎస్ వెళ్లిపోయిన హర్షను విభా జ్ఞాపకాలు వెంటాడుతాయి. దీంతో తన కోసం తిరిగి ఇండియాకు వచ్చేసిన హర్ష.. ఆమెను ఏ రకంగా మెప్పించాడు.. తనతో పెళ్లికి ఆమెతో పాటు ఇరు కుటుంబాల వాళ్లను ఎలా ఒప్పించాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ‘బొమ్మరిల్లు’ లాంటి అందరినీ మెప్పించే సినిమా తీసి ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు భాస్కర్. కానీ అతను చివరగా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమాతోనే. గుర్తుండిపోవడం అనే మాట వాడాం కాబట్టి ఆ సినిమా అందరినీ అలరించిందని కాదు. నిజానికి అదొక డిజాస్టర్. అలా అని అది పేలవమైన సినిమానా అంటే అదీ కాదు. ప్రేమ గురించి.. పెళ్లి గురించి.. అలాగే పెళ్లి తర్వాతి జీవితం గురించి ఎంతో అర్థవంతమైన చర్చ ఉంటుంది ఆ సినిమాలో. కానీ ఆ చర్చ మరీ లోతుల్లోకి వెళ్లిపోవడం.. ఒక దశ దాటాక సినిమా మరీ ‘డ్రై’ అయిపోయి ప్రేక్షకులకు నీరసం వచ్చేయడంతో బాక్సాఫీస్ దగ్గర ఆ చిత్రానికి చేదు అనుభవం తప్పలేదు. ఇప్పుడు భాస్కర్ తెరకెక్కించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రోమోలు చూస్తే ఇది ‘ఆరెంజ్’కు ఇంకో వెర్షనా అనిపించింది. ఆ అంచనా తప్పేమీ కాదు. ప్రేమ-పెళ్లి-వైవాహిక జీవితం గురించి ఇందులో కూడా పెద్ద చర్చే చేపట్టాడు భాస్కర్. ఈ అంశాల మీద అతను సమర్పించిన మరో ‘థీసిస్’ లాగా అనిపిస్తుంది ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. కాకపోతే ‘ఆరెంజ్’ అంత డ్రైగా ఈ సినిమా ఉండదు. అదే సమయంలో ‘ఆరెంజ్’లో ఉన్న క్లారిటీ.. లాజిక్స్.. ఎమోషనల్ కనెక్ట్ ఇందులో మిస్సయ్యాయి. ఏదో టైంపాస్ చేయడానికి ఓకే అనిపిస్తుందే తప్ప.. బలమైన ఇంపాక్ట్ వేయడంలో మాత్రం ఈ బ్యాచిలర్ విఫలమయ్యాడు.

‘ఆరెంజ్’ సినిమాలో సమస్యంతా హీరో చుట్టూ తిరుగుతుంది. ప్రేమలో ఉన్న ఆనందం.. పెళ్లిలో ఉండదని.. పెళ్లిలో కాంప్రమైజ్ ఉంటుందని.. ఎప్పటికీ ప్రేమికులుగానే ఉండటం కరెక్ట్ అని అంటాడు అందులో హీరో. హీరోను మార్చడానికి హీరోయిన్ సహా చుట్టూ ఉన్న వాళ్లంతా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి చివరికి అతడి రూటే కరెక్ట్ అన్న నిర్ణయానికి వస్తారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో సమస్య కథానాయిక చుట్టూ తిరుగుతుంది. పెళ్లి తర్వాత సర్దుబాట్లు చేసుకుని బతకడంలో అర్థం లేదని.. ఎవరికి నచ్చినట్లు వాళ్లుంటూ అన్ కండిషనల్ గా ఒకరినొకరు ఇష్టపడటమే నిజమైన ప్రేమ అని.. పక్క పక్కన ఉండటం కంటే ఒకరికొకరు దగ్గరగా ఉంటూ బతకడమే జీవితం అన్న స్థిరమైన ఆలోచనతో కథానాయిక ఉంటూ.. హీరో సహా చుట్టూ ఉన్న వాళ్లంతా ఆమెను పిచ్చదానిలా చూస్తారు. కానీ హీరోలో పరివర్తన వచ్చి కథానాయిక ఆలోచనే కరెక్ట్ అని ఆమెను ఆమెలా ఉంచడానికి ప్రయత్నించి తన మనసు గెలవడం.. ఇదీ స్థూలంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా.

‘ఆరెంజ్’లో చేసిన తప్పులు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో చేయకూడదన్న సంకల్పంతో కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని.. సాధ్యమైనంతగా వినోదాత్మకంగా కథనాన్ని నడిపించడానికి చూశాడు భాస్కర్. ప్రథమార్ధమంతా కూడా హీరో పెళ్ళిచూపుల నేపథ్యంలో చాలా వరకు సరదాగానే సాగిపోతుంది. 20 రోజుల తర్వాత పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుని... 20 మంది అమ్మాయిలతో పెళ్లి చూపులకు హీరో సిద్ధం కావడం.. అందులోంచి బెస్ట్ అమ్మాయిని ఎంచుకుని పెళ్లి చేసుకోవాలనుకోవడం.. సిల్లీగా అనిపించినా ఇందులో వినోదానికి మాత్రం బాగానే స్కోప్ దొరికింది. హీరోయిన్ తండ్రితో ఆరంభంలోనే చిన్న గొడవ పెట్టేసి.. ఆయనతో హీరో ట్రాక్ ను కామెడీ కోసం వాడుకున్నాడు. ఇక హీరోయిన్ వల్ల బాగా ప్రభావితం అయిన హీరో.. పెళ్లి చూపుల్లో అమ్మాయిలకు తిక్క తిక్క ప్రశ్నలేసి ఒక్కో అమ్మాయితో చెడగొట్టుకునే సన్నివేశాలు బాగానే వినోదాన్ని పంచాయి. ఇంటర్వెల్ ముంగిట కథ కొంచెం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఫస్టాఫ్ వరకు ‘బ్యాచిలర్’లో వినోదానికి లోటేమీ లేదు.

ఐతే కథానాయికకు దండం పెట్టేసి యుఎస్ వెళ్లిపోయిన హీరోను ఆమె ఆలోచనలు వెంటాడటం.. అతను తిరిగి ఇండియాకొచ్చి కథానాయిక మనసు గెలిచే ప్రయత్నం చేయడం.. ఇదంతా ఒక రొటీన్ ఫార్మాట్లో సాగిపోయే వ్యవహారం. భాస్కర్ ఇంకేదో కొత్తగా చూపిస్తాడనుకుంటే.. అందరూ నడిచే దారిలోనే నడిచాడు. కథ పరంగా ద్వితీయార్ధంలో ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు. కథానాయిక చుట్టూ తిరుగుతూనే తనెవరో ఆమెకు తెలియకుండా హీరో మేనేజ్ చేయడం.. అతను తనతో ఫోన్లో, వెనుకే ఉండి మాట్లాడుతున్నా తనెవరో ఆమె తెలుసుకోలేకపోవడం.. కనీసం అతడి ముఖం కూడా చూడకపోవడం లాంటి సిల్లీ విషయాల వల్ల ఆయా సన్నివేశాల గ్రావిటీ తగ్గిపోయింది. ఏదో నడుస్తోందంటే నడుస్తోంది అనిపిస్తుంది తప్ప ద్వితీయార్ధం ప్రేక్షకుల్లో పెద్దగా కదలిక తీసుకురాదు. ఎమోషనల్ కనెక్ట్ కూడా అనుకున్నంత మేర లేదు. చర్చించిన అంశాలు మంచివే అయినా.. వాటిని అనుకున్నంత ప్రభావవంతంగా ప్రేక్షకుల మనసుల్లోకి తీసుకెళ్లలేకపోయాడు దర్శకుడు. క్లైమాక్స్ లోనూ ఎమోషన్లు అనుకున్నంతగా పండలేదు. భాస్కర్ మంచి కాన్సెప్టే ఎంచుకుని సిన్సియర్ గానే సినిమా తీశాడు కానీ.. ఇంపాక్ట్ మాత్రం అనుకున్నంతగా లేకపోయింది. ఐతే ఒకసారి అలా టైంపాస్ చేయడానికి మాత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా క్లాస్ రొమాంటిక్ కామెడీలను ఇష్టపడే యూత్ కు ఇది నచ్చొచ్చు.

నటీనటులు:

అఖిల్ అక్కినేని తనకు సూటయ్యే పాత్రనే ఎంచుకున్నాడు. హర్షగా అతను సరిపోయాడు. పెళ్లి విషయంలో తనకు అన్నీ తెలుసనుకుని.. అనుభవం మీద తనకు తెలియాల్సింది చాలా ఉందని అర్థం చేసుకునే కుర్రాడిగా అతను మెప్పించాడు. పాతికేళ్ల కుర్రాళ్ల మనస్తత్వానికి దగ్గరగా ఉండేలా అఖిల్ తన స్క్రీన్ ప్రెజెన్స్.. నటనతో మెప్పించాడు. యాక్టింగ్ పరంగా అదరగొట్టేశాడని చెప్పలేం కానీ.. గత సినిమాలతో పోలిస్తే చాలా మెరుగయ్యాడు. కొన్ని చోట్ల తడబడ్డా.. తప్పులు దిద్దుకుని ఎదుగుతాడు అనిపిస్తుంది. పూజా హెగ్డే విభా పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. పాత్రకు తగ్గ పరిపక్వతతో.. హావభావాలతో పూజా ఆకట్టుకుంది. ఆమె గ్లామర్ సినిమాకు పెద్ద ఎస్సెట్. స్టాండప్ కమెడియన్ గా కనిపించే సన్నివేశాల్లో పూజా బాగా చేసింది. మురళీ శర్మ తన అనుభవాన్ని చూపించాడు. జయప్రకాష్.. ఆమని.. ప్రగతి.. శ్రీకాంత్ అయ్యంగార్.. అజయ్.. ప్రగతి.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లుగా నటించారు. వెన్నెల కిషోర్.. సుడిగాలి సుధీర్.. కొంత మేర నవ్వించారు. క్యామియో తరహా రోల్స్ లో నేహా శెట్టి.. ఈషా రెబ్బా.. ఫరియా అబ్దుల్లా ఓకే.

సాంకేతిక వర్గం:

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కు సాంకేతిక హంగులు బాగా కుదిరాయి.  గోపీసుందర్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. గుచ్చే గులాబి.. లెహరాయి.. పాటలు వినడానికే కాదు.. చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. మిగతా పాటలు కూడా ఓకే కానీ.. ద్వితీయార్ధంలో ఇలాంటి వినసొంపైన పాట లేకపోవడం కొంత ప్రతికూలత. ప్రదీప్ వర్మ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. విజువల్స్ సినిమా అంతటా అలరిస్తాయి. నిర్మాణ విలువలు గీతా ఆర్ట్స్ స్థాయికి తగ్గట్లే ఉన్నతంగా ఉన్నాయి. ఏ లోటూ రానివ్వలేదు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ విషయానికి వస్తే.. ప్రేమ.. పెళ్లి.. పెళ్లి అనంతర జీవితం గురించి అతడిలో ఉన్న అనేక ఆలోచనలను మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ చర్చ ఆలోచన రేకెత్తిస్తుంది కానీ.. దీన్ని వినోదాత్మకంగా చెప్పడంలో భాస్కర్ ఈసారి కూడా పూర్తిగా విజయవంతం కాలేదు. స్క్రిప్టు విషయంలో అతనెంతో కష్టపడ్డ విషయం అర్థమవుతుంది కానీ.. అతడి కథనం మాత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఎంగేజ్ చేయదు. దర్శకుడిగా అతడి సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాడు. అందుకు అభినందించొచ్చు.

చివరగా: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. పెళ్లిపై మరో థీసిస్

రేటింగ్ - 2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News