స్టార్ డైరెక్టర్లకు తప్పని వార్!

Update: 2022-09-05 10:34 GMT
ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంటర్ కావడమే కష్టం. ఆ తరువాత వరుసగా రెండు మూడు పెద్ద హిట్లు పడితే, స్టార్ డైరెక్టర్ అయిపోవచ్చని అనుకుంటారు. అయితే ఒకసారి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న తరువాత ఆ క్రేజ్ ను .. ఆ రేంజ్ ను నిలబెట్టుకోవడం అంత తేలికైన విషయం కాదనేది కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాకి వచ్చిన క్రేజ్ ఆ సినిమా వరకే అన్నట్టుగా ట్రెండ్ మారిపోయింది. ఒక డైరెక్టర్ తో సినిమా చేయాలంటే ముందు సినిమా హిట్ అయిందా లేదా అనేది మాత్రమే స్టార్ హీరోలు చూస్తున్నారు. అంతకుమించి వెనక్కి వెళ్లడం లేదు.

దాంతో స్టార్ డైరెక్టర్ లకు ప్రతి సినిమా ఒక పరీక్షగా .. వార్ గా మారిపోయింది. తమ రేంజ్ కి తగినట్టు  గానే పెద్ద ప్రాజెక్టులను భుజాలకు ఎత్తుకుని నానా కష్టాలు పడుతున్నారు. అంచనాలను అందుకోలేక అవస్థలు పడుతున్నారు. 'ఆచార్య' సినిమా విషయంలో కొరటాల శివ చాలా కామెంట్లను ఎదుర్కోవలసి వచ్చింది. ఒక వైపున చిరంజీవి .. మరో వైపున చరణ్ క్రేజ్ ను ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయారు. దాంతో మెగా అభిమానుల విమర్శలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ తరువాత ప్రాజెక్టుపై పునరాలోచన చేసే స్థాయికి ఆయన వెళ్లిపోయాడు.

ఇక పూరి జగన్నాథ్ కి కూడా ఇలాంటి పరిస్థితినే ఎదురైంది. 'లైగర్' సినిమాతో ఆయన ఒక రేంజ్ లో అంచనాలు పెంచేశాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

మాస్ హీరో ... మాస్ డైరెక్టర్ కాంబినేషన్లో వచ్చే సినిమా మామూలుగా ఉండదనే ఆలోచనలో జనాలు పొలోమంటూ థియేటర్లకు వెళ్లారు. తాము అనుకున్నట్టుగా లేదంటూ నీరసంతో బయటికి వచ్చారు.  ఆర్ధిక పరమైన బాధ్యతను కూడా వీరు తలకెత్తుకోవడం వల్లనే క్రియేటివ్ సైడ్ దెబ్బ కొట్టేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇక సాంఘిక చిత్రాలతో పాటు చారిత్రక చిత్రాలను తీయడంలో కూడా క్రిష్ కి మంచి అనుభవం ఉంది. ఆయన 'హరి హర వీరమల్లు' ప్రాజెక్టు సెట్స్ పైనే ఉంది. ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఆయన చేసిన చిన్నపాటి ప్రయోగంగా 'కొండ పొలం' వచ్చింది.

కానీ ఆశించిన ప్రయోజనాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇదే రూట్లో వెళ్లిన మారుతి కూడా అసలు .. కొసరు విషయంలోను దెబ్బతిన్నాడు. ఇక వినాయక్ 'ఛత్రపతి' రీమేక్ ను భుజాన వేసుకుని, తెలుగులో వచ్చిన గ్యాపును మరింత పెంచుకున్నాడు. మొత్తానికి పెద్ద డైరెక్టర్లలో చాలామంది ప్రస్తుతం తమ కెరియర్ ను కష్టంగానే నెట్టుకొస్తున్నారని చెప్పుకోవాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News