మీడియాను ఏసుకున్న ముర‌ళీమోహ‌న్‌

Update: 2017-10-01 09:38 GMT
మ‌రో సినీ ప్ర‌ముఖుడు మీడియాను ఏసుకున్నాడు. కార‌ణం ఏదైనా కానీ.. ఇటీవ‌ల కాలంలో సినీ ప్ర‌ముఖులు మీడియాను ఏదో విధంగా టార్గెట్ చేయ‌టం క‌నిపిస్తోంది. గ‌తంలో నేర‌స్వ‌భావం ఉన్న నేత‌లు సైతం మీడియా విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించేవారు. ఇప్పుడ‌దంతా పోయింది. ఎవ‌రికి వారు.. వారి వారి స్థాయిల్లో హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌టం మొద‌లైంది. ఈ మ‌ధ్య‌న మ‌రింత ఎక్కువైంది.

గ‌తంలో మీడియా అంటే సినిమా వారి తీరు వేరుగా ఉండేది. ఇప్పుడు ఏ చిన్న విమ‌ర్శ‌ను సైతం స్వీక‌రించేందుకు సిద్ధంగా లేని త‌త్త్వం క‌నిపిస్తోంది. ఎంత భ‌జ‌న చేసినా హ్యాపీగా ఫీల‌య్యే సినీ ప్ర‌ముఖులు.. విమ‌ర్శ‌లకు వెల్ కం చెప్పేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు.

ఇటీవ‌ల రివ్యూల మీద తార‌క్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఏర్పాటై పాతికేళ్లు పూర్తి అయిన సంద‌ర్భంగా మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన సీనియ‌ర్ న‌టుడు..  ఎంపీ ముర‌ళీ మోహ‌న్ మాట్లాడుతూ సినిమా వాళ్లు అద్దాల మేడ‌లో ఉంటార‌ని.. ఒక్క రాయి వేస్తే ప‌గిలిపోతుంద‌న్నారు. సినిమా వాళ్ల విష‌యంలో మీడియా అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఏ సంఘ‌ట‌న జ‌రిగినా మీడియా అతిగా స్పందిస్తున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

ఈ మ‌ధ్య‌న ఒక వెబ్ సైట్ సినిమావాళ్ల గురించి అభ్యంత‌ర‌క‌రంగా రాస్తున్నారని.. వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. త్వ‌ర‌లోనే మా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు నిర్వ‌హిస్తామ‌ని.. అవి బాహుబ‌లి వేడుక‌ల‌కు మించి ఉంటాయ‌న్నారు.

ఇక‌.. మా అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనుక‌బ‌డిన క‌ళాకారుల‌ను ఆదుకునేందుకు త‌మ అసోసియేష‌న్ సాయం చేస్తుంద‌న్నారు. ల‌క్ష‌లాది రూపాయిలు సంపాదిస్తూ కూడా మాలో చేర‌ని వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. పేద క‌ళాకారులు మాత్రం స‌భ్య‌త్వం తీసుకోకున్న ఫ‌ర్లేద‌న్నారు.

త్వ‌ర‌లో మా అధ్వ‌ర్యంలో వృద్ధాశ్ర‌మాన్ని నిర్మిస్తున్నామ‌ని దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఎస్వీ కృష్ణారెడ్డి ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌న్నారు. ఈ మ‌ధ్య‌న మ‌ర‌ణించిన ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ చిరంజీవి ఫ్యామిలీకి మా అసోసియేష‌న్ త‌ర‌ఫున రూ.6ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. పేద క‌ళాకారుల్ని ఆదుకోవ‌టానికి శివాజీ రాజా రూ.25వేల చెక్కును మాకు అంద‌జేశారు.
Tags:    

Similar News