కొత్త ప్రకాష్ రాజ్ దొరికాడు

Update: 2015-09-09 23:19 GMT
ప్రకాష్ రాజ్.. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే అలవోకగా చేసుకెళ్లిపోతాడు. ఐతే కొన్నేళ్లుగా ఆయన్ని ఒకేరకం పాత్రలకు పరిమితం చేసేశారు. హీరోను డీల్ చేయలేక సతమతమయ్యే హీరోయిన్ తండ్రి పాత్రల్లో ఆయన్ని చూసి చూసి జనాలు విసుగెత్తిపోయారు. ఐతే సరైన ఆప్షన్ లు లేకపోవడం వల్ల మన దర్శకులు చాలాసార్లు ఆయనతోనే కాంప్రమైజ్ అయిపోయారు. ఐతే ఒకట్రెండేళ్ల నుంచి పరిస్థితి మారింది. ప్రకాష్ రాజ్ ప్లేస్ ను రావు రమేష్ రీప్లేస్ చేస్తున్నాడు. ఐతే ఆయన కూడా వరుసగా అలాంటి పాత్రలే వేస్తుండటంతో కొంచెం మొనాటనీ వచ్చేస్తోంది. ఇలాంటి సందర్భంలో టాలీవుడ్ కు కొత్త ‘తండ్రి’ని పరిచయం చేశాడు డైరెక్టర్ మారుతి.

‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరోయిన్ తండ్రిగా చేసిన మురళీ శర్మ ప్రేక్షకులకు భలేగా నచ్చేశాడు. ప్రకాష్ రాజ్ తో మొహం మొత్తేసి.. రావు రమేష్ కూడా రొటీన్ అయిపోతున్న సమయంలో మురళీ శర్మ హీరోయిన్ తండ్రి పాత్రలో రిఫ్రెషింగ్ గా అనిపించాడు. పాండురంగారావు పాత్రలో ఒదిగిపోయిన మురళీ శర్మ తనలోని కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేశాడు. ‘అతిథి’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన మురళీ.. ఆ తర్వాత చెప్పుకోదగ్గ పాత్రలేమీ చేయలేదు. అతడికి ఫుల్ లెంగ్త్ విలన్ రోల్స్ దక్కలేదు. చివరగా ‘ఎవడు’లో చేసిన పాత్ర కూడా చెప్పుకోదగ్గదేమీ కాదు. ఐతే సడెన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ లోకి మారిపోవడం కలిసొచ్చింది. ఇకపై ఇలాంటి క్యారెక్టర్ లు మురళీ శర్మకు మరిన్ని దక్కే అవకాశముంది. మురళీ శర్మ నటుడిగా అరంగేట్రం చేసి పేరు సంపాదించింది బాలీవుడ్ లోనే అయినా.. అతను తెలుగువాడే కావడం విశేషం. మురళీ గుంటూరు వాడు. ఐతే చాలా ఏళ్ల కిందటే వాళ్ల కుటుంబం ముంబయిలో సెటిలైంది.
Tags:    

Similar News