నా భయమే నా సక్సెస్ కి కారణం: రాజమౌళి

Update: 2022-03-10 04:05 GMT
రాజమౌళి .. తెలుగు సినిమాను ప్రపంచ పటానికి పరిచయం చేసిన పేరు. తెలుగు సినిమాకు మరింత కీర్తినీ .. వైభవాన్ని తెచ్చిన పేరు. ఒక కథలో ఏ పాత్రను ఎక్కడ మొదలుపెట్టాలో .. ఎక్కడ ముగించాలో .. ఈ మధ్యలో ఆ పాత్రతో ఎలాంటి ప్రయాణం చేయించాలో ఆయనకి బాగా తెలుసు. అలాగే ఒక కథలో ఏ విషయాన్ని ఎప్పుడు విప్పాలో .. ఎప్పుడు చెప్పాలో అనే విషయంపై కూడా ఆయనకి మంచి అవగాహన ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన సినిమాలు నడుస్తుంటాయి .. అవి బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను పరుగులు పెట్టిస్తుంటాయి.

ఒక సినిమాను పెర్ఫెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లడానికి ఆయన ఎంతో కసరత్తు చేస్తారు. ప్రతి సినిమాను ఒక పందిరిలా వేయడానికీ .. పండుగలా థియేటర్స్ కి తీసుకుని రావడానికి ఎంతగానో కష్టపడతారు. అందువల్లనే ఆయన సినిమాలపై  ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతారు.

మరెంతో కుతూహలాన్ని కనబరుస్తారు. ఆయన తాజా చిత్రమైన 'ఆర్ ఆర్ ఆర్' కోసం కూడా వాళ్లంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి.

తాజా ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ .. "నాకు ఫెయిల్యూర్ అంటే భయం ఎక్కువ. ఆ భయం వల్లనే నేను ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను. ఆ భయం వల్లనే ఒక మేజిక్ జరుగుతుంది. నా ప్రతి సినిమా కూడా అంతకుముందు సినిమాకి మించి ఉండాలనే ఒక బలమైన సంకల్పం వల్లనే నేను అనుకున్నది చేస్తూ ముందుకు వెళుతుంటాను. ప్రతి సినిమాను మాత్రమే కాదు .. ప్రతి దృశ్యాన్ని తెరపై కొత్తగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాను. నా నుంచి సినిమాకి ఏది కావాలో అది చివరి నిమిషం వరకూ అందించడానికే ట్రై చేస్తుంటాను. నా సక్సెస్ కి కారణం కూడా అదే" అని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అజయ్ దేవగణ్ .. అలియా భట్ కీలకమైన పాత్రలను పోషించారు. ఇక ఆగ్లేయ పాలకుల పాత్రలను హాలీవుడ్ నటీనటులతో చేయించారు. తిరుగుబాటు .. పోరాటం నేపథ్యంలోని కథ కావడం వలన, యాక్షన్ ఎపిసోడ్స్ ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేయనున్నాయి.

సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ముంబై .. చెన్నై ..  కేరళ ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇక ఇప్పుడు బెంగుళూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Tags:    

Similar News