పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయి...సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయనకు తన రాజకీయ యాత్రే ముఖ్యమని తేల్చి చెప్పేశాడు. ఒప్పుకున్న సినిమాలు చేసే వీలు లేదని నేరుగానే ఒప్పుకున్నారు. ఇప్పడదే కాస్త కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టింది. ఓ చిత్ర నిర్మాణ సంస్థ మా సినిమా చేస్తారా? వడ్డీతో సహా మా డబ్బులు మాకిస్తారా అని రచ్చ చేస్తోందట.
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తరువాత మరో సినిమా చేయనని చెప్పేశాడు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో తన పార్టీని బలంగా చేసుకునేందుకు జిల్లాలు తిరిగే పనిలో బిజీ అయిపోయారు. ఈ పరిస్థితిని ముందే ఊహించని పవన్ కొన్నళ్ల క్రితమే సినిమాలు ఒప్పుకోవడం, వారి దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకోవడం జరిగిపోయింది. అయితే ఇప్పుడు సినిమాలు చేయనని మీడియా ముందే చెప్పేశారు పవన్. దీంతో ఇప్పటికే సినిమా కోసం ఏర్పాట్లు చేసుకున్న నిర్మాణ సంస్థలు, నిర్మాతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం... ఓ నిర్మాణ సంస్థ పవన్ కు అల్టిమేటం పెట్టినట్టు ఫిల్మ్ నగర్‌లో ఒకటే గుసగుసలు. అదెంత వరకు నిజమో తెలియదు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఒక సినిమా చేస్తానని కొన్నాళ్ల క్రితమే ఒప్పందం చేసుకున్నారట పవన్. అందుకోసం ముందుగానే రూ.12 కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారట. ఇప్పుడు పవన్ ఆ సినిమా చేయనని చెప్పేశాడు. దీంతో సదరు సంస్థ తమ సినిమా చేయాలని లేకుంటే వడ్డీతో సహా తమ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాలని కండిషన్ పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వడ్డీతో పాటూ ఆ డబ్బు రూ.20 కోట్లు అయ్యిందట. ఆ మొత్తాన్ని డిమాండ్ చేస్తోందట మైత్రీ మూవీ మేకర్స్. ఈ కథనం నిజమే అయితే... పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది కాస్త ఆసక్తికరమైన విషయమే.