రోహిత్ స్పీడ్ ఆగేలా లేదుగా!

Update: 2018-07-25 04:38 GMT
మంచి ఎనర్జీ టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక విజయాన్ని అందుకోలేకపోతున్న నారా రోహిత్ ని ఒక్క విషయంలో అభినందించి తీరాలి. ఫలితంతో సంబంధం లేకుండా కుదిరితే బయటివారితో లేదా తన స్వంత బ్యానర్ లో వరసబెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ దూకుడు ఇప్పటిది కాదు. గత మూడు నాలుగేళ్ల నుండి ఇదే తీరు. హీరోగా చేస్తానని నియమం పెట్టుకోలేదు. అప్పట్లో ఒకడుండేవాడులో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రను కథ నచ్చింది కాబట్టి చేసేసాడు. బాలకృష్ణుడు పేరుతో ఓ రెగ్యులర్ మసాలా సినిమా తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. అవి సూట్ కావని త్వరగా గుర్తించి మళ్ళి తాను బలంగా నమ్ముకునే డిఫరెంట్ జానర్స్ వైపు వచ్చేసాడు. షూటింగ్ పూర్తవుతోంది అని తెలియడం ఆలస్యం ఎక్కువ గ్యాప్ లేకుండా కొత్తవాటిని లైన్ లో పెట్టడం చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ప్రస్తుతం వీర భోగ వసంతరాయులు తో పాటు ఆటగాళ్లు షూటింగ్ పూర్తి చేసే దశలో ఉన్న నారా రోహిత్ అప్పట్లో దక్షిణాదిలో అంటూ నిన్న తన కొత్త సినిమా తాలూకు పోస్టర్ విడుదల చేసాడు. 1971లో సౌత్ లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఇది రూపొందుతోందని క్యాప్షన్ లోనే చెప్పేసారు. ఇవి కాకుండా శబ్దం అనే మరో సినిమా కూడా షూటింగ్ లో ఉంది.

ఇన్నేసి సినిమాలు చేస్తున్నా రోహిత్ ఒకదానికి మరొకటి సంబంధం లేకుండా జాగ్రత్త పడుతున్నాడు. వీరభోగవసంతరాయులు ఫాంటసీ టచ్ ఉన్న సస్పెన్స్ మూవీ కాగా ఆటగాళ్లు జగపతిబాబుతో కలిసి చేసిన క్రైమ్ థ్రిల్లర్. ఇక శబ్దం విషయానికి వస్తే మాటలు రాని మూగవాడిగా కొత్త పాత్ర ట్రై చేస్తున్నాడని టాక్. దేనిలోనూ ఇంకో సినిమాతో కలిసే కామన్ పాయింట్ లేదు. ఫ్రెండ్ కం హీరో శ్రీవిష్ణుతో కూడా తన నిర్మాణంలో రెగ్యులర్ గా సినిమాలు తీసే రోహిత్ బాణం-రౌడీ ఫెలో తరహాలో మళ్ళి సక్సెస్ అందుకోలేకపోయాడు. పరిశ్రమకు వచ్చిన 9 ఏళ్ళకే 25 సినిమాల మార్కుకు చేరువ కావడం  చిన్న విషయం కాదు. కానీ అందులో విజయాల శాతం చాలా తక్కువగా ఉండటమే ఫాన్స్ కి బాధ కలిగిస్తోంది. అయినా కూడా సబ్జెక్టు సెలక్షన్ లోను పెర్ఫార్మన్స్ పరంగానూ రోహిత్ మీద పెద్ద కంప్లైంట్స్ లేవు. కాస్త బొద్దుగా ఉండటం తప్ప. వెంకటేష్ తో తేజ తలపెట్టిన ఆటా నాదే వేటా నాదేలో రోహిత్ కూడా ఉన్నాడు. అది ఆగకపోయి ఉంటే రోహిత్ ఖాతాలో మరొకటి యాడ్ అయ్యేది.
Tags:    

Similar News