అమ్మ పెట్టిన డబ్బులన్నీ వచ్చాయి

Update: 2020-02-09 03:50 GMT
నాగశౌర్య హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఉషా నిర్మించిన అశ్వథ్థామ చిత్రం ఇటీవ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోమ్‌ బ్యానర్‌ సినిమా అవ్వడంతో నాగశౌర్య చాలా కష్టపడి సినిమా ప్రమోషన్స్‌ చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. సినిమా విడుదలకు ముందు నుండే నాగశౌర్య విభిన్నంగా ప్రమోషన్స్‌ ప్లాన్‌ చేసుకుంటూ సినిమాను ప్రమోట్‌ చేశాడు. సినిమా విడుదల తర్వాత కూడా వదిలి పెట్టకుండా సక్సెస్‌ మీట్‌.. థ్యాంక్స్‌ మీట్‌ అంటూ మీడియా ముందుకు వస్తున్నాడు.
 
తాజాగా ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ లో పాల్గొన్న నాగశౌర్య పలు విషయాలపై మాట్లాడాడు. తన గత చిత్రం నర్తనశాల గురించి మాట్లాడుతూ తన జీవితంలో చేసిన పెద్ద మిస్టెక్‌ అన్నాడు. ఆ సినిమా విడుదల తర్వాత మా కుటుంబ సభ్యులందరం కూడా ఆరు నెలల పాటు చాలా నిరుత్సాహంలో ఉండిపోయాం. అందుకే ఇకపై ఎప్పుడు కూడా అలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇక అశ్వథ్థామ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ రావడం చాలా సంతోషంగా ఉంది.

అన్ని ఏరియాల బయ్యర్లు కూడా సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చి లాభాలు వస్తున్నాయని చెబుతుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక అమ్మ పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆమెకు వెనక్కు రావడం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందంటూ నాగశౌర్య చెప్పుకొచ్చాడు. దర్శకుడు రమణతేజకు సినిమా అంటే చాలా పిచ్చి. ఎప్పుడు చూసినా ఆయన తిండి లేదా సినిమా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మా కష్టంకు ప్రతిఫలం అంటూ నాగశౌర్య సక్సెస్‌ మీట్‌ లో ఆనందాన్ని పంచుకున్నాడు.

Tags:    

Similar News