కురుక్షేత్రంలో 'అశ్వ‌ద్ధామ‌' వా?

Update: 2019-06-09 09:06 GMT
టైటిల్ తోనే స‌గం హిట్టు సాధ్యం. టైటిల్ జ‌నాల‌కు క‌నెక్ట‌యితే ఆ మేర‌కు థియేట‌ర్ల‌కు జ‌నాల్ని లాక్కొచ్చే వెసులు బాటు ఉంటుంద‌ని మ‌న ద‌ర్శ‌క‌ నిర్మాత‌లు బ‌లంగా న‌మ్ముతారు. అందుకు తగ్గ‌ట్టే ఎంతో ఆచితూచి క‌థ‌కు త‌గ్గ టైటిల్ ని ఎంపిక చేసుకుని బ‌రిలో దిగుతుంటారు. ఇక ఈ విష‌యంలో హీరో నాగ‌శౌర్య సైతం ఎంతో ఎలర్ట్ గానే ఉంటాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు. అత‌డు న‌టించిన గ‌త సినిమాల టైటిల్స్ స‌ర‌ళిని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌రం. సొంత బ్యాన‌ర్ ఐరా క్రియేష‌న్స్ సినిమాల‌కు ఛ‌లో.. న‌ర్త‌నశాల‌ లాంటి క్రియేటివ్ టైటిల్స్  ని ఎంపిక చేసుకున్నాడు. ఈసారి కూడా సొంత బ్యాన‌ర్ లోనే సినిమా చేస్తున్నాడు.

తాజా చిత్రానికి  శౌర్య అండ్ టీమ్ ఓ క్రియేటివ్ టైటిల్ ని ఎంచుకున్నారని తెలుస్తోంది. `అశ్వ‌ద్ధామ` అనే ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశార‌ని క్లోజ్ సోర్స్ చెబుతోంది. అశ్వ‌ద్ధామ అనే సౌండింగే ప‌వ‌ర్ ఫుల్‌. అందుకు త‌గ్గ క‌థాంశంతోనే ఈ సినిమా తెర‌కెక్కుతోంద‌ట‌. నాగ‌శౌర్య‌- మెహ్రీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేష‌న్స్‌ బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా రెండవ షెడ్యూల్  వైజాగ్ లో పూర్త‌వుతోంది. ఇక ఈ సినిమా క‌థాంశం టైటిల్ లోనే దాగి ఉంది.

అశ్వత్థామ `మహాభారతం`లో ద్రోణుని కుమారుడు. అతడు మరణం లేని చిరంజీవి. ద్రోణాచార్యునికి ఎంతో ప్రియమైనవాడు. కురుక్షేత్ర సంగ్రామం చివరిలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ఒకడు. తన కుమారుడు మరణించాడన్న వదంతులకు కుంగిపోయిన ద్రోణుడు అస్త్ర సన్యాసం చేసి దృష్టద్యుమ్నుని చేతిలో మరణిస్తాడు. కక్షతో రగిలిపోయిన అశ్వథ్థామ చనిపోతున్న తండ్రి దగ్గర యుద్ధానంతరం ఎలాగైనా దృష్టద్యుమ్నుని చంపుతాన‌ని అనుమతి తీసుకున్నాడు. మహాభారత యుద్ధానంతరం తాను ఎలాగైనా పాండవులను చంపుతానని అశ్వత్థామ దుర్యోధనుడికి మాట ఇస్తాడు. ఆ త‌ర్వాత ప‌రిణామాలేంటి? అన్న‌ది మ‌హాభార‌త క‌థ‌లో ఆస‌క్తిక‌రం. అయితే ఇదే లైన్ తో కురుక్షేత్ర యుద్ధం త‌ర‌హాలో బోలెడ‌న్ని స‌న్నివేశాల‌తో శౌర్య ప్ర‌స్తుత సినిమా తెర‌కెక్కుతోంద‌ట‌. అయితే అశ్వ‌ద్ధామ టైటిల్ ని టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా.

   

Tags:    

Similar News