‘అన్నపూర్ణ’లో అగ్నిప్రమాదంపై స్పందించిన నాగార్జున

Update: 2020-10-16 16:50 GMT
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం జరిగిందని ఈ ఉదయం నుంచి మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం హైదరాబాద్ లోని కృష్ణానగర్ వద్ద ఉన్న అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు మీడియాలో హైలెట్ అయ్యింది. అగ్ని కీలలు ఎగిసిపడ్డాయని.. పెద్దవిగా ఉన్నాయని.. స్టూడియో అంతటా దట్టమైన పొగ వ్యాపించిందని.. లోపల ఉన్న బిగ్ బాస్ సెట్ కు దగ్గర వరకు వచ్చాయని మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఈ ప్రమాదం వార్తలు రాగానే టాలీవుడ్ లో కలకలం రేగింది. ఈ అగ్నిప్రమాదంపై తాజాగా అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం స్పందించింది. అన్నపూర్ణ స్టూడియోల నిర్వహణను చూస్తున్న వారు అంతగా కంగారు పడాల్సిన అగ్ని ప్రమాదం కాదని నివేదించారు. అన్నపూర్ణ స్టూడియో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ మేరకు ఒక పోస్టు పెట్టారు. “అన్నపూర్ణ స్టూడియో వద్ద అంతా బాగానే ఉంది! దయచేసి అగ్నిప్రమాద వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండండి’ అంటూ అభ్యర్థించారు.

తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాద వార్తలపై ఆ స్టూడియో యాజమాన్యంలో ఒకరు, ప్రముఖ హీరో నాగార్జున స్పందించారు. మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధమని నాగార్జున తెలిపారు. "ఈ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో పెద్ద అగ్నిప్రమాదం జరిగిందని మీడియాలో కొన్ని కథనాలు ఉన్నాయి. దీనిపై ఎవరూ చింతించవద్దు. ఎందుకంటే ఇవి తప్పుడు వార్తలు. అన్నపూర్ణ స్టూడియోలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రతిదీ ఖచ్చితత్వంతో ఉంది" అని నాగార్జున తాజాగా ట్వీట్ చేశారు.

స్టూడియోలోని ఒక అంతస్తులో ఒక సినిమా కోసం వేసిన సెట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి చిన్న అగ్నిప్రమాదం జరిగిందని.. ఇది త్వరగా అదుపులోకి వచ్చిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలను నాగార్జున, అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యం ఖండిస్తూ అలాంటి ప్రమాదం ఏది జరగలేదని క్లారిటీ ఇచ్చింది.
Tags:    

Similar News