నాగార్జున నార్త్ కష్టాలు

Update: 2018-09-24 10:10 GMT
ఇంతకుముందు ఉత్తరాది ప్రాంతాలకు వెళ్తే ప్రశాంతంగా ఉండేదని.. ఇప్పుడు కష్టమైపోతోందని అంటున్నాడు అక్కినేని నాగార్జున. తెలుగు సినిమాలు హిందీలోకి డబ్ అయి.. యూట్యూబ్ లో.. హిందీ ఛానెళ్లలో తెగ ఆడేస్తుండటంతో అక్కడి మారుమూల ప్రాంతాల్లోని జనాలకు కూడా తెలుగు హీరోలు బాగా తెలిసిపోతున్నారని.. దీంతో ఈ మధ్య ఏ ఉత్తరాది ప్రాంతానికి వెళ్లినా జనాలు గుర్తు పట్టేసి ఇబ్బంది పెట్టేస్తున్నారని ఆయన అన్నారు.

ఇంతకుముందు హైదరాబాద్ దాటితే ఎక్కడైనా ఫ్రీగా తిరిగేసేవాడినని.. కానీ ఇప్పుడు ఇండియాలో ఎక్కడా నడుచుకుంటూ వెళ్లలేని పరిస్థితి వచ్చిందని నాగ్ చెప్పాడు. ‘ఆఫీసర్’ సినిమా కోసం ముంబయికి వెళ్లి షూటింగ్ చేస్తుంటే జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారని.. చాలా ఇబ్బందయిందని నాగ్ చెప్పాడు. ‘బాహుబలి’ సినిమాతో భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయని.. ఎక్కడ మంచి సినిమా చేసినా అది అన్ని చోట్లకూ వెళ్లిపోతోందని.. ముఖ్యంగా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా పరిధి బాగా పెరిగిందని నాగ్ అన్నాడు.

ప్రస్తుతం తాను ఒకేసారి తెలుగు.. హిందీ.. తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నానని.. తమిళంలో ధనుష్ దర్శకత్వంలో తాను చేస్తున్న పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని నాగ్ చెప్పాడు. ‘బ్రహ్మాస్త్ర’లో తన పాత్ర ఉండేది తక్కువ సేపే అయినా చాలా బలంగా ఉంటుందని అనడంతో ఒప్పుకున్నానని.. వాళ్లు చెప్పినట్లే ఆ పాత్ర ఉంటోందని.. కథ బాగున్నపుడు తన పాత్ర పరిధి.. నిడివి గురించి తాను ఆలోచించనని.. చేసేస్తానని నాగ్ స్పష్టం చేశాడు.


Tags:    

Similar News