వర్మతో అఖిల్ సినిమా..నాగ్ ఏమన్నాడంటే?

Update: 2018-05-31 07:41 GMT
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌ హీరో కావడానికంటే ముందే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అతడి తొలి సినిమా ‘అఖిల్’కు బంపర్ క్రేజ్ వచ్చింది. ఒక పెద్ద హీరో సినిమా స్థాయిలో దానికి బిజినెస్ జరిగింది. కానీ ఆ చిత్ర ఫలితమేంటో తెలిసిందే. అఖిల్ రెండో సినిమా ‘హలో’కు కూడా హైప్ వచ్చింది. ఆ చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ దాని ఫలితమూ మారలేదు. ఇప్పుడు ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరితో తన మూడో సినిమాను మొదలుపెడుతున్నాడు అఖిల్. ఈ చిత్రం అఖిల్ భవితవ్యాన్ని నిర్దేశించనుంది. ఐతే దీని తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అఖిల్ నటిస్తాడన్న వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలే అఖిల్ కెరీర్ అంతంతమాత్రంగా ఉంటే.. దశాబ్ద కాలంగా పేలవమైన ట్రాక్ రికార్డుతో ఉన్న వర్మతో అతను సినిమా చేయడమేంటి అన్న సందేహాలు నెలకొన్నాయి.

అఖిల్ కెరీర్ విషయంలో ఆందోళనగా ఉన్న నాగార్జున ఈ చిత్రానికి ఎలా ఓకే చెప్పాడన్న డౌట్లు కొట్టాయి. ఐతే నాగ్ తాజా వ్యాఖ్యల్ని బట్టి చూస్తే ఆయనేమీ ఈ సినిమా పట్ల అంత సానుకూలంగా ఏమీ లేడనిపిస్తోంది. వర్మ దర్శకత్వంలోనే నాగ్ నటించిన ‘ఆఫీసర్’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన నాగార్జునకు అఖిల్-వర్మ సినిమా గురంచి ప్రశ్న ఎదురైంది. దీనికాయన బదులిస్తూ ఆ సినిమా గురించి నేనైతే ట్వీట్ చేయలేదుగా అనేశాడు. అఖిల్-వర్మ మధ్య చర్చలు నడుస్తున్నాయని.. వాళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుందో లేదో వాళ్లే చెబుతారంటూ సమాధానం దాటవేశాడు నాగ్. ఆయనిలా అన్నాడని.. అఖిల్-వర్మ సినిమా విషయంలో జోక్యం ఏమీ ఉండదనుకుంటే పొరబాటే. చాలా ఏళ్ల తర్వాత వర్మతో ‘ఆఫీసర్’ సినిమా చేసిన నాగార్జునకు అతడి పనితనం ఇప్పుడెలా ఉందో బాగానే అర్థమై ఉంటుంది. కాబట్టి అఖిల్ సినిమా విషయంలో నాగ్ నిర్ణయం కీలకం కాకుండా ఎలా ఉంటుంది?
Tags:    

Similar News