రాయితో కూడా రాజమౌళి యాక్ట్ చేయించగలరు!

Update: 2021-11-16 10:12 GMT
తెలుగు తెరకి 'చెన్నకేశవ రెడ్డి' సినిమాతో నాగినీడు పరిచయమయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ, ఆయనకి బాగా గుర్తింపు తెచ్చిన సినిమా 'మర్యాద రామన్న'. ఆ సినిమాలో ఆయన పాత్రను .. ఆయన దానిని పండించిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆయన, 'మర్యాద రామన్న' సినిమాను గురించి ప్రస్తావించారు. "రాజమౌళి గారు ఈ సినిమా కోసం నన్ను అడిగారు. ఈ పాత్రకి నన్ను తీసుకోవద్దనీ .. వేరే వారిని తీసుకోమని కొంతమంది చెబుతున్నారని కూడా అన్నారు.

ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత చూశాను .. అప్పుడు అనిపించింది నాకు .. ఆ సినిమా సక్సెస్ కి ఒకే ఒక కారణం రాజమౌళిగారు అని. నేను కారణమని ఆడియన్స్ అనుకోవచ్చు .. నేను మాత్రం డైరెక్టర్ కారణమని అంటాను. అప్పటికే ఆయన 'మగధీర' .. 'ఈగ' వంటి సినిమాలు చేశారు. ఈ సినిమాలో ఆయనను సపోర్ట్ చేయడానికి ఎలాంటి గ్రాఫిక్స్ లేవు .. ఎక్స్ లెంట్ స్క్రీన్ ప్లే తో ఆయన ఈ సినిమాను నడిపించారు. నా అదృష్టం బాగుండి అవకాశం నాకు వచ్చింది .. కానీ ఆయన ఒక రాయితో కూడా యాక్ట్ చేయించగలరు. అంత ప్రతిభ కలిగిన డైరెక్టర్ ఆయన.

'మర్యాద రామన్న'లో నేను చాలా బాగా నటించానని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నా ఒరిజినల్ కేరక్టర్ అదే. ఎవరైనా నాకు ఇంత మర్యాద ఇస్తే .. నేను ఎంతో మర్యాద ఇస్తాను. ఎవరైనా కొంచెం తేడా చూపిస్తే నేను చాలా తేడా చూపిస్తాను. నాలోనే కాదు .. ఇలా ప్రతి వ్యక్తిలోను మరొకరు ఉంటారు. చాలా బాగా చేశావని ఎవరు పొగిడినా అది నా మైండ్ కి ఎక్కదు. ఎందుకంటే ఎలా చేశాననేది నాకు తెలుసు .. మళ్లీ అదే విషయాన్ని నాకు చెప్పడం ఎందుకు? అందువల్లనే విమర్శలు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతాను. అవి నన్ను నేను సరిచేసుకోవడానికి పనికొస్తాయి.

'మర్యాద రామన్న' తరువాత నాకు వరుస సినిమాలు పడ్డాయి. బాగా పేరు తీసుకొచ్చిన సినిమాల్లో 'మిర్చి' ఒకటి అని చెప్పాలి. ఆ సినిమాలో ఒక కాలేజ్ సీన్ ఉంటుంది. ఒక అమ్మాయిని కాలేజ్ లో చేర్పించి నేను బయటికి రాగానే ఆ అమ్మాయి నన్ను కృతజ్ఞతతో పట్టుకుంటుంది .. అప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కి ప్రభాస్ గారు ఆశ్చర్యపోయారు. నాగినీడు గారు భలే ఎక్స్ ప్రెషన్ ఇచ్చారని అందరితోను చెప్పారు. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News