'అఖండ' దెబ్బకి అమెరికాలో స్పీకర్లు అదిరిపోయాయి: బాలయ్య

Update: 2022-03-13 09:30 GMT
ఇంతవరకూ తెలుగు తెరపై ఒక స్టార్ హీరో 'అఘోర' పాత్ర చేయడానికి సాహసించలేదు. అలాంటి ఒక పాత్రను క్రియేట్ చేయడానికి ఏ దర్శకుడు ధైర్యం చేసింది లేదు. 'అఖండ'తో ఈ రెండు పనులు చేసి అనూహ్యమైన విజయాన్ని అందుకున్నవారిగా బాలకృష్ణ - బోయపాటి కనిపిస్తారు.
ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. 103 థియేటర్స్ లో 50 రోజులు ఆడేసిన ఈ సినిమా, 4 థియేటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నిన్న రాత్రి 'కర్నూల్' వేదికగా ఈ సినిమా 100 రోజుల వేడుకను నిర్వహించారు. కర్నూల్ .. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

ఈ వేదికపై బాలకృష్ణ మాట్లాడుతూ .. "ప్రకృతికి .. స్త్రీలకు .. పసిపిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్లను కాపాడటానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడనే సందేశంతోనే ఈ సినిమాను తీయడం జరిగింది. ఇలాంటి ఒక సినిమా చేసే అవకాశం మాకు కలగడం వెనుక కూడా భగవంతుడి అనుగ్రహమే ఉంది. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెబుతున్నాను.

నేను .. బోయపాటి కట్టే .. కొట్టే .. తెచ్చే అన్నట్టుగా మూడు ముక్కల్లో కథను అనుకుంటాము. ఆ తరువాత దానిపై కసరత్తు జరుగుతుంది. ముత్యాలు ఏటవాలుగా దొర్లితే ఎంత అందంగా ఉంటాయో .. నటీనటులు తమ హావభావాలను సరిగ్గా పలికిస్తే అంత బాగా ఉంటుంది.

అలాంటి హావభావాలను ఆర్టిస్టుల నుంచి రాబట్టగల సమర్ధుడు బోయపాటి శ్రీనుగారు. మేము ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రోత్సహిస్తున్నారు .. ఆదరిస్తున్నారు. మేమున్నాము .. మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి అంటున్నారు. అలాంటి అభిమానులు దొరకడం నిజంగా మా అదృష్టం.

చరిత్ర సృష్టించాలన్నా మేమే .. దానిని తిరగరాయాలన్నా మేమే. అందుకు నిదర్శనంగానే ఈ సినిమా కర్నూల్ జిల్లాలోని మూడు థియేటర్స్ లో 100 రోజులను పూర్తి చేసుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోను ఒక థియేటర్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. మాకు ఎవరూ పోటీకాదు .. మాకు మేమే పోటీ. 'సింహా'కు పోటీ 'లెజెండ్' .. లెజెండ్ కి పోటీ 'అఖండ'.

కరోనా సమయంలోనే ఈ సినిమా షూటింగు జరుపుకుంది .. కరోనా సమయంలోనే థియేటర్లకు వచ్చింది. ఇక్కడే కాదు ఈ సినిమా అమెరికాలో విడుదలైతే అక్కడి స్పీకర్లు పగిలిపోయాయి. 'అఖండ' తెలుగు సినిమాకి దిక్సూచి గా నిలవడం నిజంగా గొప్ప విషయం. అందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News