తిరిగి రాని లోకాల‌కు నంద‌మూరి తార‌క‌ర‌త్న

Update: 2023-02-18 22:07 GMT
టాలీవుడ్ యువ‌న‌టుడు నందమూరి తారకరత్న(39) క‌న్ను మూశారు.  గుండెపోటుతో మూడు వారాల క్రితం బెంగళూరు నారాయణ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న సంగ‌తి తెలిసిందే. గత 23 రోజులుగా ఆసుపత్రి లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవలి నివేదికలు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సూచించాయి. తాజా స‌మాచారం మేర‌కు విదేశీ డాక్టర్ల‌తో చికిత్స చేయించినా ఆయన ప్రాణాన్ని నిలబెట్టలేక పోయారు. తారకరత్న ఈ రోజు (శనివారం 18న )తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

తారకరత్న మరణ వార్త సినీ లోకంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. నందమూరి ఫ్యామిలీ కి పలువురు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. తారకరత్నను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు బెంగళూరు చేరుకున్నారు. మీడియా కథనాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన స్పెషలిస్ట్ వైద్యులు ఇటీవల బెంగళూరు వచ్చి బ్రెయిన్ మ్యాపింగ్ చేశారు. అవసరమైతే తారకరత్నను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించవచ్చు  అని చెప్పారు. కానీ అనుకున్న‌వేవీ సాధ్య‌ప‌డలేదు. ఆయన పరిస్థితిపై త్వరలో నారాయణ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేయనుందని ఎదురు చూస్తుండ‌గా ఇంత‌లోనే అత‌డు మ‌ర‌ణించార‌ని వైద్యులు ధృవీక‌రించారు.

జనవరి 27న కుప్పంలో జరిగిన రాజకీయ పార్టీ ర్యాలీలో పాల్గొన్న తారకరత్నకు గుండెపోటు రావడంతో బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. తారకరత్న 2002 లో 'ఒకటో నంబర్ కుర్రాడు' చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రారంభ‌మ‌య్యారు. ఒకే రోజు ఏడు సినిమాల ప్రారంభోత్స‌వాల‌తో క‌థానాయ‌కుడిగా తార‌క‌ర‌త్న రికార్డును సృష్టించారు. తార‌క‌ర‌త్న ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు.

Similar News