మరో రవితేజ అయిపోయాడుగా..

Update: 2017-02-07 22:30 GMT
టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత గత 30 ఏళ్లో సొంత కాళ్లపై నిలదొక్కుకుని.. స్టార్ హీరో అయింది రవితేజ మాత్రమే అన్నాడు దిల్ రాజు ‘నేను లోకల్’ ఆడియో వేడుకలో. రవితేజ తర్వాత అలా ఎదుగుతున్న హీరో నాని మాత్రమే అని కితాబిచ్చాడు రాజు. ‘నేను లోకల్’ సక్సెస్ రేంజ్ చూస్తుంటే.. నాని రవితేజలా ఎదుగుతుండటం కాదు.. రవితేజ స్థాయిని అందుకునేశాడేమో అనిపిస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ నాని స్టామినా ఏంటో చూపిస్తున్నాయి. నాని నిజంగా స్టార్ హీరో అని ఒప్పుకుని తీరాల్సిందే ఇప్పుడు. మామూలుగా చూస్తే ‘నేను లోకల్’ గొప్ప సినిమా ఏమీ కాదు. కానీ ఆ చిత్రం ఈ స్థాయి సక్సెస్ అయిందంటే అందులో నాని క్రెడిట్ సగం ఉందంటేు అతిశయోక్తి కాదు.

‘నేను లోకల్’ మాత్రమే కాదు.. దీనికి ముందు వచ్చిన మజ్ను.. జెంటిల్ మన్ సినిమాలు చూసినా అవి మామూలుగా అనిపిస్తాయి. కేవలం నానీనే ఆ సినిమాల స్థాయిని పెంచాడు. సక్సెస్ లో కీలక పాత్ర పోషించాడు. ఇలా సగటు సినిమాల్ని కూడా పెద్ద రేంజికి తీసుకెళ్లేవాడినే స్టార్ అంటారు. కాబట్టి నాని ఇప్పుడు స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు రవితేజ కూడా అలా అలా చూస్తుండగానే స్టార్ అయిపోయాడు. ఒక దశ దాటాక అతడికంటూ ఒక మార్కెట్ ఏర్పడింది. మాస్ రాజా సినిమా హిట్టయితే 30 కోట్లు గ్యారెంటీ.. ఫ్లాప్ అయినా అందులో సగమైతే వచ్చేస్తుంది అనే భరోసా వచ్చేసింది. ఇప్పుడు నాని విషయంలోనూ అలాంటి భరోసానే కనిపిస్తోంది. నాని సినిమా అంటే మినిమం 15 కోట్లు వేసుకోవచ్చని.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 20 కోట్లు గ్యారెంటీ అని.. సినిమా హిట్టయితే రూ.25 కోట్ల దాకా వసూళ్లు ఖాయం అన్న భరోసా వచ్చేసింది. ‘నేను లోకల్’ ఆల్రెడీ ఫస్ట్ వీకెండ్లోనే రూ.15 కోట్ల షేర్ రాబట్టింది. ఫుల్ రన్లో రూ.25-30 కోట్ల మధ్య షేర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News