నాని వచ్చే వరకు కష్టాలు తప్పవా?

Update: 2017-12-05 23:30 GMT
దసరా.. దీపావళి సినిమాల సందడి ముగిశాక కళ తప్పాయి థియేటర్లు. అందులోనూ నవంబరు నెలలో అయితే థియేటర్లు వెలవెలబోయాయి. ‘గరుడవేగ’ సినిమా కొంతమేర జనాల్ని థియేటర్లకు రప్పించినప్పటికీ.. అది కూడా హౌస్ ఫుల్స్ తో ఏమీ నడవలేదు. మిగతా సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. చెప్పుకోవడానికి 25-30 సినిమాల దాకా రిలీజయ్యాయి కానీ.. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవి చాలా చాలా తక్కువ. నెలాఖర్లో వచ్చిన ‘ఆక్సిజన్’.. ‘ఇంద్రసేన’ కూడా తుస్సుమన్నాయి. డిసెంబరు నెల అయినా భిన్నంగా ఉంటుందేమో అనుకుంటే.. ‘జవాన్’ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది.

తొలి రోజు సందడి చేసిన ‘జవాన్’.. రెండో రోజు నుంచి చల్లబడిపోయింది. వసూళ్లు సాధారణంగా ఉన్నాయి. ఈ సినిమా పెట్టుబడిని రికవర్ చేయడం కష్టంగానే ఉంది. ఇక డిసెంబర్లో తర్వాతి రెండు వారాంతాల మీద కూడా పెద్దగా ఆశలేమీ లేవు. నెక్స్ట్ వీకెండ్లో సప్తగిరి సినిమా ‘సప్తగిరి ఎల్ ఎల్‌ బీ’.. సుమంత్ మూవీ ‘మళ్ళీ రావా’ రాబోతున్నాయి. వీటి స్థాయి తక్కువే. వీటిపై అంచనాలూ తక్కువే. తర్వాతి వారానికి అసలు సినిమాలేవీ షెడ్యూల్ కాలేదు. ఇక మళ్లీ థియేటర్లలో సందడి కనిపించేది క్రిస్మస్ వీకెండ్లోనే అని చెప్పాలి. డిసెంబరు 21న నాని సినిమా ‘ఎంసీఏ’ థియేటర్లలోకి దిగాక పరిస్థితి మారొచ్చు. ఆ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి కాబట్టి హౌస్ ఫుల్స్ తో థియేటర్లు కళకళలాడొచ్చు. అదే వారాంతంలో అఖిల్ సినిమా ‘హలో’ కూడా రాబోతోంది. అది కూడా మంచి అంచనాలున్న సినిమానే. ఇక నెలాఖర్లో ‘ఒక్క క్షణం’.. ‘చలో’.. ‘2 కంట్రీస్’ లాంటి మీడియం రేంజి సినిమాలు వస్తాయి. వీటి సందడి ముగిసేలోపు సంక్రాంతి ధమాకా మొదలవుతుంది. కాబట్టి క్రిస్మస్ వీకెండ్ వరకు జనాలు కొంచెం ఓపిక పట్టాలి.
Tags:    

Similar News