కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్3 రిలీజ్ కి రెడీగా ఉంది. రెండు నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ వాయిదా పడింది. డీమానిటైజేషన్ నుంచి.. ఏదో ఒక సమస్య ఈ చిత్రాన్ని వెంటాడుతూనే ఉంది. జనవరి 26న విడుదల కావాల్సి ఉన్న ఎస్3.. తమిళనాడులో జల్లికట్టు ఆందోళనల కారణంగా వాయిదా పడింది.
ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు జరుపుతున్నాడు సూర్య. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడం తప్పనిసరి కావడంతో.. ఇక్కడ నాని మూవీ నేను లోకల్ తో పోటీ పడాల్సి వస్తోంది. వరుస హిట్స్ జోరు మీదున్న నాని.. ఇప్పటికే నేచురల్ స్టార్ అయిపోయి.. భారీ వసూళ్లు రాబట్టేస్తున్నాడు. అలాగే థియేటర్లలో ఉన్న పొంగల్ సినిమాలు ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్నాయి.
ఇలాంటి సమయంలో నాని మూవీతో పాటు.. సూర్య సినిమాకి థియేటర్లు కేటాయించడం డిస్ట్రిబ్యూటర్లకు సమస్యగా మారనుందని అంటున్నారు. అయితే.. ఎస్3 చిత్రాన్ని ఫిబ్రవరి 3న రిలీజ్ చేయడంపై.. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/