సెప్టెంబర్ 10న నాని 'టక్ జగదీష్'..?

Update: 2021-08-17 07:30 GMT
నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ''టక్‌ జగదీష్''. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది నిర్మించారు. ఏప్రిల్ 27న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా ఏ వేదికపై విడుదల అవుతుందనే విషయం మీద రకరకాల వార్తలు వచ్చాయి.

'టక్‌ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరుగగా.. చిత్ర బృందం రెండుసార్లు ఆ వార్తలను ఖండించింది. ఇప్పుడు థియేటర్స్ తెరుచుకుంటున్నా ఈ సినిమా విడుదలపై అనౌన్స్ మెంట్ రాకపోవడంతో సినీ అభిమానులు కాస్త ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో నాని సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు మరోసారి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈసారి మేకర్స్ దీన్ని ఖండించలేదు. అలాగని అంగీకరించ లేదు కూడా.

అయితే ఇప్పుడు 'టక్ జగదీష్' చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని.. రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. భారీ ధరకు నాని సినిమాని తీసుకున్న అమెజాన్ వారు.. వినాయక చవితి కానుకగా ఈ చిత్రాన్ని స్ట్రేమింగ్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారనేది దీని సారాంశం. సెప్టెంబర్ 10వ తేదీన ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని.. ఆగస్టు 20న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి.

'టక్ జగదీష్' సినిమా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డిజిటల్ వేదికలో విడుదల అవుతుందనే విషయం నిజమో కాదో తెలియాలంటే.. మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇకపోతే నాని 25వ సినిమా 'వి' గతేడాది కరోనా లాక్ డౌన్ లో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

కాగా, 'టక్ జగదీష్' చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇది ‘నిన్నుకోరి’ తర్వాత నాని - శివ నిర్వాణ కాంబోలో వస్తున్న సినిమా. ఇందులో రీతూవర్మ - ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటించారు. జగపతి బాబు - నాజర్ - డేనియల్ బాలాజీ - ప్రియదర్శి - తిరువీర్ - రోహిణి - ప్రవీణ్ ఇతర పాత్రలు పోషించారు. థమన్ సంగీతం సమకూర్చగా.. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించారు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.


Tags:    

Similar News