వాళ్లు వద్దన్న పాత్రనే ఆమె చేసింది.. ఫలితం?
ఐతే వేరే వాళ్లకు అభ్యంతరంగా మారిన విషయం తనకు అస్సలు సమస్యలా అనిపించలేదని.. పిల్లల తల్లిగా నటించడానికి తనకు ఏ ఇబ్బందీ లేదని ఆమె చెప్పింది.
ఒక హీరో లేదా హీరోయిన్ వద్దన్న పాత్రను ఇంకెవరో చేయడం.. ఆ సినిమా హిట్టయి వాళ్లకు మంచి పేరు రావడం ఇండస్ట్రీలో జరిగే తంతే. ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కథానాయికగా నటించిన ఐశ్వర్యా రాజేష్ కూడా ఇప్పుడు ఇలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది.
ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న భాగ్యం పాత్రకు ఫస్ట్ ఛాయిస్ ఐశ్వర్య కాదట. ఈ క్యారెక్టర్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ముందు ముగ్గురు నలుగురు హీరోయిన్లను సంప్రదించాడట. కానీ వాళ్లెవ్వరూ ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. అందుక్కారణం.. నలుగురు పిల్లల తల్లిగా నటించాల్సి రావడమే. ఈ విషయాన్ని ఐశ్వర్యనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ విషయం చెప్పొచ్చో లేదో అంటూ అనిల్ దగ్గర అనుమతి తీసుకుని మరీ వెల్లడించింది ఐశ్వర్య.
ఐతే వేరే వాళ్లకు అభ్యంతరంగా మారిన విషయం తనకు అస్సలు సమస్యలా అనిపించలేదని.. పిల్లల తల్లిగా నటించడానికి తనకు ఏ ఇబ్బందీ లేదని ఆమె చెప్పింది. ఈ పాత్రకు తాను ఒప్పకున్నపుడు.. సినిమా చూశాక తాము ఏం మిస్సయ్యామో ఇంతకుముందు నో చెప్పిన హీరోయిన్లకు అర్థమవుతుందని అనిల్ వ్యాఖ్యానించినట్లు ఆమె తెలిపింది. నిజంగా ఇప్పుడు థియేటర్లలో భాగ్యం పాత్రకు వస్తున్న స్పందన చూసి ఈ పాత్రకు నో చెప్పిన వాళ్లు కచ్చితంగా రిగ్రెట్ అవుతూనే ఉంటారు.
ఈ సినిమా తెలుగులో ఐశ్వర్యకు పెద్ద మలుపు అనే చెప్పాలి. దివంగత నటుడు రాజేష్ తనయురాలైన ఐశ్వర్య తెలుగమ్మాయే అయినా.. తమిళంలో నటిగా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో కౌసల్యా కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించినా.. అవి విజయం సాధించకపోవడంతో ఆమెకిక్కడ సరైన గుర్తింపు రాలేదు. కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ కాబోతుండడంతో ఆమె దశ తిరిగినట్లే.