అందరి కళ్లూ ఆ సినిమాపైనే..!

ఈసారి సంక్రాంతి స్పెషల్ గా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Update: 2025-01-16 04:14 GMT

ఈసారి సంక్రాంతి స్పెషల్ గా 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండేసి రోజుల గ్యాప్ లో ఒకదాని తర్వాత ఒకటి విడుదలయ్యాయి. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఎలాంటి సక్సెస్ సాధించింది? పొంగల్ విన్నర్ ఏది? అనేది ఈ వీకెండ్ తో తేలిపోతోంది. ఇక సంక్రాంతి సినిమాలు మార్కెట్ లోకి వచ్చేయండంతో, తర్వాత థియేటర్లలోకి రాబోయే 'తండేల్' గురించి టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి.

అప్ కమింగ్ సినిమాలలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "తండేల్" ఒక్కటే అని చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ ఇది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. వాలెంటైన్స్ వీక్ లో ఫిబ్రవరి 7, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే 'తండేల్' టీమ్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ విశేషంగా ఆకట్టుకోగా.. 'బుజ్జి తల్లి', 'నమో నమః శివాయ' పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. ఇదంతా సినిమా చుట్టూ బలమైన బజ్ ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కచ్ఛితంగా మ్యాజిక్ చేస్తుందనే నమ్మకాన్ని కలిగించింది.

గతంలో నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన 'లవ్ స్టోరీ' మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. 'అమరన్' లాంటి సక్సెస్ సాధించి సాయి పల్లవి మంచి ఫామ్‌లో ఉంది. గీతా ఆర్ట్స్ వంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న సినిమా అంటే తప్పకుండా ఏదో విషయం ఉండే ఉంటుదని సినీ అభిమానులు ఫిక్స్ అవుతుంటారు. ఈ అంశాలన్నీ ఇప్పుడు ''తండేల్'' మూవీపై అంచనాలు ఏర్పడేలా చేశాయి. మేకర్స్ త్వరలో రిలీజ్ చేయబోయే ట్రైలర్ తో అంచనాలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

రాజు, బుజ్జి తల్లి అనే ఇద్దరి మధ్య జరిగే అధ్బుతమైన గ్రామీణ ప్రేమకథగా "తండేల్'' మూవీ తెరకెక్కుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లాలోని డి. మచ్చిలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇందులో నాగ చైతన్య ఒక మత్స్యకారునిగా తొలిసారిగా డీగ్లామర్ లుక్ లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీ రేట్లకు ఫైనలైజ్ చేయబడినట్లుగా ప్రచారం జరుగుతోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. స్ట్రాంగ్ బజ్, హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి.. దానికి తగ్గట్టుగా గట్టిగా ప్రమోషన్స్ చేస్తే హ్యూజ్ ఓపెనింగ్స్ రావడం గ్యారంటీ. టాక్ ఎలా ఉన్నా ప్రేమికుల రోజు సందర్భంగా యూత్ అంతా థియేటర్లకు తరలి వస్తారు. విడుదలకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే వుంది. ఈ గ్యాప్ లో మేకర్స్ అగ్రెసివ్ గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కనుక తమిళం, హిందీలోనూ ప్రచారం చేయాలి. చూద్దాం.. 'తండేల్' టీమ్ ఏం చేస్తుందో!

Tags:    

Similar News