'మా' ఎన్నిక‌లు .. బిగ్ బ్ర‌ద‌ర్స్ ఫైట్‌?

Update: 2019-03-02 17:04 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల వేడి రాజుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 750 మంది పైగా స‌భ్యులు ఉన్న ప్ర‌తిష్ఠాత్మ‌క సంఘం `మా`కు మార్చి 10న ఎన్నిక‌లు కావ‌డంతో ఈసారి పోటీబ‌రిలో ఎవ‌రెవ‌రు ఉన్నారు? అంటూ టాలీవుడ్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుత `మా` అధ్య‌క్షుడు శివాజీరాజా మ‌రోసారి అధ్య‌క్ష ప‌ద‌వికి ఏక‌గ్రీవం అవుతార‌ని ఇటీవ‌ల చ‌ర్చ సాగింది. త‌న బ‌ర్త్ డే రోజున ఈసారి పోటీకి దిగే త‌న ప్యాన‌ల్ స‌భ్యుల వివ‌రాల్ని ప్ర‌క‌టించారు శివాజీరాజా. అయితే  నిన్న‌టివ‌ర‌కూ అత‌డికి వ్య‌తిరేకంగా పోటీ చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డంతో ఈ నిశ్శ‌బ్ధాన్ని ఏక‌గ్రీవ‌మే అని అనుకున్నారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని ట్విస్టు.

2018 చివ‌రిలో `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజాపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ విరుచుకుప‌డిన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీనియ‌ర్ న‌రేష్ చ‌డీ చ‌ప్పుడు లేకుండా సైలెంట్ గా తెర‌పైకి వ‌చ్చారు. సైలెంట్ గా దూసుకొచ్చిన న‌రేష్ ప్యానెల్ స‌డెన్ స‌ర్ ప్రైజ్ ని ఇచ్చింది. న‌రేష్ పోటీకొస్తారా.. లేదా.. శివాజీ రాజాతో క‌లిసి మ‌ళ్లీ ప‌ని చేస్తారా? అంటూ కొంత సందిగ్ధ‌త నెల‌కొన్న వేళ అత‌డు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతుండ‌డం ఉత్కంఠ పెంచుతోంది. న‌రేష్ తో పాటుగా ఈసారి ఎన్నిక‌ల్లో హీరో రాజ‌శేఖ‌ర్, జీవిత పోటీబ‌రిలో దిగుతుండ‌డంతో మ‌రింత వేడి పెరిగింది. ఈసారి ఎన్నికల్లో.. గెలుపెవ‌రిది? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేచింది. ఇప్ప‌టికే శివాజీ రాజా వ‌ర్గం `ముంద‌స్తు`గా ప్యానెల్ ని ప్ర‌క‌టించి గెల‌వాల‌న్న పంతంతో ఉంది. పైగా మార్చి 11 త‌ర్వాత చాలా సంగ‌తులు చెబుతాన‌న్న శివాజీ రాజా ఏం చెబుతాడోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

నేడ హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో న‌రేష్ త‌న ప్యానెల్ ని ప్ర‌కటించారు. `మా` అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపాధ్య‌క్షుడిగా యాంగ్రీ హీరో రాజశేఖర్‌, జనరల్‌ సెక్రటరీగా జీవిత బరిలోకి దిగుతున్నారు. ఈ సంద‌ర్భంగా న‌రేష్ మాట్లాడుతూ .. `మా`లో గొడ‌వ‌లు వ‌ద్ద‌నుకోవ‌డం వ‌ల్ల‌నే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాన‌ని అన్నారు. ల‌క్ష‌ల్లో డొనేష‌న్లు ఇచ్చే మా ఫ్యామిలీ నుంచి ఒక్క‌సారైనా అధ్య‌క్షుడు కావాల‌ని చాలా మంది అడిగార‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ఒక్కో ట‌ర్మ్ అధ్య‌క్షుడిగా ప‌ని చేద్దామ‌ని శివాజీ రాజా అన్నార‌ని తెలిపారు.  ప్ర‌స్తుతం అసోసియేష‌న్ స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా హీరో రాజ‌శేఖ‌ర్ ఆరోపించ‌గా, ఆడ‌వాళ్ల‌కు `మా`లో స‌రైన ప‌ద‌వులు లేవ‌ని జీవిత విమ‌ర్శ‌లు గుప్పించారు. మొత్తానికి న‌రేష్ - రాజ‌శేఖ‌ర్ - జీవిత త్ర‌యం అనూహ్యంగా `మా`లో వేడి పెంచారు. న‌రేష్ టీమ్ లో కోశాధికారిగా కోట శంక‌ర్‌రావు పోటీ చేస్తున్నారు. పోటీ ఉండ‌దేమో అనుకున్న వేళ‌..అనూహ్య ప‌రిణామాల‌తో ఎన్నిక‌ల ర‌గ‌డ ఇంకెంత ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుందో వేచి చూడాలి. కొత్తగా ఎన్నిక‌య్యే ప్యానెల్ 2019-21 సీజ‌న్ కి బాధ్య‌త‌ల్ని చేప‌డుతుంది.
Tags:    

Similar News