కేసీఆర్ పాత్రకు ఆయన సెట్టవుతాడా?

Update: 2018-06-29 07:30 GMT
టాలీవుడ్లో వరుసగా బయోపిక్స్ తెరమీదికి వచ్చేస్తున్నాయి. తెలుగు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు రాజకీయ నాయకుల కథల్ని కూడా తెరమీదికి తేబోతున్నారు. నందమూరి తారక రామారావుతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథను ఒకేసారి వెండితెరకు ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. 2019 ఎన్నికల ముంగిట ఈ రెండు చిత్రాలు విడుదలయ్యే అవకాశముంది. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద కూడా ఒక సినిమా తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయనపై తీయబోయే సినిమా పేరు.. ఉద్యమ సింహం. ఐతే ఈ టైటిల్ అదీ చూస్తే కేసీఆర్ ను ఆకాశానికెత్తేసే సినిమాలాగా అనిపిస్తోంది. మామూలుగా అయితే ఇలాంటి సినిమాల్ని జనాలు పెద్దగా పట్టించుకోరు.

కానీ ‘ఉద్యమ సింహం’లో కేసీఆర్ పాత్ర చేయబోయే నటుడు మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. దక్షిణాదిన అత్యంత గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న తమిళ సీనియర్ నటుడు నాజర్ ఇందులో కేసీఆర్ పాత్ర చేయబోతుండటం విశేషం. ఈ సినిమాకు ఆయన ఒప్పుకోవడం విశేషమే. కేసీఆర్ పాత్ర కోసం తాను కొన్ని నెలలుగా సిద్ధమవుతున్నట్లు నాజర్ చెప్పారు. కొన్ని రోజులుగా యూట్యూబ్‌ లో కేసీఆర్ వీడియోలు చూస్తూ తాను ఆయన బాడీ లాంగ్వేజ్‌ ను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానని.. 500కు పైగా సినిమాల్లో నటించిన తన కెరీర్లో ‘ఉద్యమ సింహం’ ఒక మైలురాయిలా నిలిచిపోతుందని నాజర్ అన్నారు. కాకపోతే లావుగా కనిపించే నాజర్.. చాలా బక్కగా ఉండే కేసీఆర్‌‌లా ఎలా కనిపించి మెప్పిస్తారన్నది సందేహం. అట్లూరి కృష్ణం రాజు దర్శకత్వంలో కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News