2024లో కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టిన సినిమాలు ఇవే!
తక్కువ బడ్జెట్ లో మూవీస్ తీసి, ఎవరూ ఊహించని కలెక్షన్లు సాధించారు.
2024లో భారతీయ చిత్ర పరిశ్రమలో మలయాళ సినిమాల జోరు కనిపించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో మాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడిపోయింది. ఓటీటీలోనే కాదు, థియేటర్లలోనూ సత్తా చాటగలమని మలయాళీ ఫిలిం మేకర్స్ ఈ ఏడాది ఫ్రూవ్ చేశారు. కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలనే సంచలనాలు సృష్టించారు. 500 కోట్లు, 1000 కోట్ల క్లబ్స్ లో చేరిన సినిమాలు లేవు కానీ, బాక్సాఫీస్ వద్ద అందర్నీ అవాక్కయ్యేలా చేసిన సినిమాలున్నాయి. తక్కువ బడ్జెట్ లో మూవీస్ తీసి, ఎవరూ ఊహించని కలెక్షన్లు సాధించారు. ఈ సినిమాలు మలయాళంలో కాదు, తెలుగులోనూ మంచి ఆదరణ పొందడం విశేషం.
''మంజుమ్మెల్ బాయ్స్'' మూవీ మాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ చెరిపేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. వాస్తవ సంఘటన స్ఫూర్తితో ఎస్. చిదంబరం తెరకెక్కించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కాసుల వర్షం కురిపించింది. కేవలం ₹20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టి తీస్తే, బాక్సాఫీసు వద్ద ₹240 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సెన్సేషన్ సక్సెస్ అందుకుంది. దీంతో 200+ కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ డ్రామా ''ది గోట్ లైఫ్ - ఆడు జీవితం'' మంచి విజయం సాధించింది. వాస్తవ ఘటనల ఆధారంగా డైరెక్టర్ బ్లెస్సీ ఈ చిత్రాన్ని తీశారు. పూర్తిగా ఎడారిలో తీసిన తొలి భారతీయ చిత్రం ఇది. దీని కోసం దాదాపు 15 ఏళ్లు కష్టపడ్డారు. దానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. ఈ మూవీ ₹160 కోట్లను రాబట్టింది. అలానే ఫహద్ ఫాజిల్ నటించిన ''ఆవేశం'' సినిమాకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. మలయాళంలో మాత్రమే విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ₹150 కోట్లకు పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ''ప్రేమలు'' మూవీ ఊహించని విజయాన్ని సాధించింది. కేవలం ₹3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ₹135 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడంతో, తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో టాలీవుడ్ లో ఆల్ టైం హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మలయాళ డబ్బింగ్ మూవీగా నిలిచింది. టొవినో థామస్ నటించిన "ఏఆర్ఎం" (ARM) సినిమా ₹100 కోట్ల క్లబ్ లో చేరింది.
పృథ్వీరాజ్ సుకుమార్, బాసిల్ కలిసి నటించిన ''గురువాయిర్ అంబలనడయిల్" సినిమా కోసం ₹15 కోట్లు ఖర్చు చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర ₹90 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా అంచనా వేయబడింది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ''భ్రమయుగం'' చిత్రం ₹85 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో తీసిన సినిమా కావడం విశేషం. ఇక "వర్షంగళ్కు శేషం" చిత్రం ₹80 కోట్లు సాధిస్తే... ₹7 కోట్లతో తీసిన "కిష్కింధ కాండమ్" మూవీ ₹75 కోట్లు కొల్లగొట్టింది.
మమ్ముట్టి నటించిన "టర్బో" చిత్రం ₹70 కోట్ల వరకూ వసూలు చేయగలింది. జయరామ్, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ''అబ్రహం ఓజ్లర్'' మూవీ బాక్సాఫీస్ వద్ద ₹40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. టొవినో థామస్ హీరోగా ₹8 కోట్లతో తీసిన ''అన్వేషిప్పిమ్ కండెతుమ్'' చిత్రం ₹40 కోట్లకు పైగా వసూలు చేసింది. లేటెస్టుగా బాక్సాఫీస్ బరిలో దిగిన ఉన్ని ముకుందన్ "మార్కో" సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 6 రోజుల్లోనే 60 కోట్ల గ్రాస్ రాబట్టింది. త్వరలోనే ₹100 కోట్ల క్లబ్ లో చేయబోతోంది.
ఇలా 2024లో మలయాళ ఇండస్ట్రీ నుంచి అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. భారీ బడ్జెట్, కళ్ళు చెదిరిపోయే గ్రాఫిక్స్, హీరో ఎలివేషన్ సీన్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు.. ఇవేవీ ఈ చిత్రాల్లో కనిపించవు. ఇవి చాలా తక్కువ బడ్జెట్ లో తీసిన కంటెంట్ డ్రివెన్ సినిమాలు. అయినప్పటికీ ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ థ్రిల్ ను కలిగిస్తూ, సరికొత్త అనుభూతిని పంచాయి. వీటిల్లో 'మార్కో' 'టర్బో' సినిమాలు మాత్రమే యాక్షన్ ప్రధానంగా తెరకెక్కాయి. ఓవరాల్ గా ఈ ఏడాది మాలీవుడ్ కు బాగానే కలిసొచ్చింది. మరి వచ్చే సంవత్సరం ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.